Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందీక్ష విరమించిన కవిత, విశారదన్‌

దీక్ష విరమించిన కవిత, విశారదన్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మసమాజ్‌ పార్టీ అధ్యక్షులు విశారదన్‌ మహారాజ్‌ నిరవధిక దీక్షను విరమించారు. బుధవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్‌ ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్లలో ఆక్రమణలు జరిగాయన్న ప్రభుత్వం నిస్సిగ్గుగా అర్హులున్నారని చెబుతోందన్నారు. అర్హులైన పేదల ఇండ్లను కూల్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన టోకెన్లపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. లే అవుట్‌ తీసి ప్రతి కుటుంబానికి ప్రాపర్టీ ఎక్కుడుందో చూపించాలని కోరారు. పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమేననీ, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదాన్‌ భూములపై ప్రభుత్వం కుట్ర చేసి వెలుగుమట్లలో కూల్చివేతలతో ట్రయల్‌ చేసిందన్నారు. భూదాన్‌ భూములు పేదల భూములనీ, వాటికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక భూదాన్‌ భూములను పేదలకు పంచుతామని ఆమె ప్రకటించారు. కూల్చిన ఇండ్లలో కొంతమంది రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.30 లక్షలతో నిర్మించుకున్నారనీ, వారికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మిగిలిన నష్టం ఎవరిస్తారని ఆమె ప్రశ్నించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య సమక్షంలో మరోసారి బాధితులతో కలిసి మాట్లాడుతామనీ, ప్రగతిశీల శక్తులతో కలిసి పోరాడుతామని కవిత తెలిపారు. వెలుగుమట్ల బాధితులకు మూడేండ్ల తర్వాత న్యాయం చేస్తామని ప్రతిపక్షాలు చెప్పాయని ఎద్దేవా చేశారు. బాధితులకు వెంటనే న్యాయం జరగాలని వెలుగుమట్ల ఆడబిడ్డల చైతన్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్‌ పార్టీ, జాగృతి కార్యకర్తలు అసాధారణ పోరాటంతో విప్లవం వచ్చిందన్నారు. నిజ నిర్ధారణ కమిటీ నివేదిక వచ్చాక మళ్లీ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కవిత డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -