హామీల అమలు పట్టని సీఎం రేవంత్‌రెడ్డి
ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళీ మాట్లాడరెందుకు? : తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ ఉద్యమకారులకు కేసీఆర్ న్యాయం చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్ర ప్రజలను బీఆర్‌ఎస్ విస్మరించిందంటూ తాను న్యాయం చేస్తానంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యమకారులను ఆదుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి లాంటి వారు మౌనంగా ఎందుకుంటున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించాలనీ, వారికిచ్చిన హామీలు రూ.25 వేల పెన్షన్, 250 గజాల స్థలం, అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటివి అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని ఆమె హెచ్చరించారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆమె మాట్లాడారు. రాంజీగోండు మొదలు కొమురం భీం వంటి వారు నిజాం సర్కారుకు, రజాకార్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు, నాటి భారత సైన్యం అణచివేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ముల్కీ రూల్స్, 1995లో జనశక్తి ఆధ్వర్యంలో వరంగల్ డిక్లరేషన్, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు నిత్యం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్ (నాడు టీఆర్‌ఎస్) అధికారంలోకి వచ్చాక కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు. పైగా తెలంగాణ వ్యతిరేకులకు, సమైఖ్యవాదులకు పెద్దపీట వేశారని ఆమె ఆరోపించారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలేమీలేదంటూ.. తాము చేస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును నిర్లక్ష్యం చేస్తున్నదని కవిత విమర్శించారు.
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్థిత్వం ఉన్న పార్టీ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరులోనూ, ఆశయంలోనూ, ఆచరణలోనూ ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సహకరించిన చిన్న కాంట్రాక్టర్లు, బడ్జెట్ స్కూళ్ల యజమానులు, చిన్న ప్రింటింగ్ ప్రెస్‌లు, పాత్రికేయులు, రచయితలు, కళాకారులను గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. ఉద్యమకారుల ఆకాంక్షలు పట్టించుకోకనే కేసీఆర్ అధికారం కోల్పోయారనీ, అదే పని చేస్తే రేవంత్‌రెడ్డిని కూడా ప్రజలు గద్దె దింపుతారని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రయివేటు సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్ తెలంగాణ వారికి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం యాప్‌ను తీసుకొచ్చామనీ, వారికి జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేయబోతున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు, నాయకులు మాట్లాడారు.
కేసీఆర్ న్యాయం చేయలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



