Tuesday, April 29, 2025
Navatelangana
Homeప్రధాన వార్తలుఅభద్రతా భావంలోకేసీఆర్‌..

అభద్రతా భావంలోకేసీఆర్‌..

  • – ఖజానా ఖాళీ చేసింది ఆయనే..
    – ఉల్టా మాపై విమర్శలా? : మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌
    – ప్రజల్లోకి వెళ్లి పథకాలపై ప్రచారం చేయాలంటూ ఎమ్మెల్యేలకు సూచన

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
    బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే ఎల్కతుర్తిలో నిర్వహించిన సభలో ఆయన అక్కసుతో కూడిన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. కేసీఆర్‌ ప్రసంగంలో స్పష్టత కొరవడిందనీ, పస లేదని అన్నారు. పిల్లగాళ్లకు (కేటీఆర్‌, హరీశ్‌) ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందంటూ కేసీఆర్‌ మాట్లాడారనీ, అలాంటప్పుడు వారినెందుకు అసెంబ్లీకి పంపుతున్నారు ? మీరే రావచ్చు కదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి, తనకు మధ్య గ్యాప్‌ ఉందంటూ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమ న్నారు. తమద్దరి మధ్య ఎంతటి అనుబంధముందో అందరికీ తెలుసునని వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాలో ప్రతినిధులతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పదేండ్లపాటు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం, దుబారా చేసింది కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. అదే కేసీఆర్‌ ఇప్పుడు తమపైనా, తమ ప్రభుత్వంపైనా నిందలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఆయనతోపాటు ప్రధాని మోడీ తమ అవసరాన్నిబట్టి రోజుకో మాట మారుస్తారని ఎద్దేవా చేశారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇందిరాగాంధీ లాంటి నాయకులు ప్రధానిగా రావాలని సీఎం ఆకాంక్షించారు. గతంలో ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఆమె సొంతమన్నారు. ప్రపంచలో ఇందిరకు మించిన యోధురాలు లేదని కితాబిచ్చారు. తాను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదని రేవంత్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం తెచ్చినన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఆర్నెల్ల సమయం ఉందనగా… తమ ప్రభుత్వం, పాలన, పథకాలపై చర్చించాలని ప్రతిపక్షాలకు సూచించారు. కగార్‌ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు.పార్టీలో చర్చించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సూచించారు. అలా ఉంటేనే పథకాలు ప్రజలకు చేరువవుతాయని తెలిపారు. ఓపికగా ఉంటేనే పదవులొస్తాయనీ, అందుకు అద్దంకి దయాకరే ప్రత్యక్ష ఉదాహరణని వివరించారు. అలాగాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతా రని హెచ్చరించారు. తానింకా ఇరవై ఏండ్లపాటు రాజకీయాల్లో ఉంటానని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అన్ని విషయా ల్లోనూ చట్ట ప్రకారమే నడుచుకు ంటానని తెలిపారు. అవినీతికి పాల్పడిన నేతలను జైలుకు పంపాలంటూ పలువురు కోరుతున్నారని చెప్పారు. అయినా తాను ఆ పని చేయటం లేదని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు, అమలు చేసిన పథకాలను ప్రచారం చేసుకోవటంలో వెనుకబడ్డామని ఆయన వాపోయారు. ఈ విషయంలో దూకుడు పెంచాల్సి ఉందని చెప్పారు. అధికారుల విషయంలో మరింత సమన్వయం చేసుకుంటూ, సంయమనంతో ముందుకు సాగాల్సి ఉందని అన్నారు. కొందరు అధికారులు సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, విషయ పరిజ్ఞానం ఉన్నవారినే ప్రోత్సహిస్తున్నామని రేవంత్‌ వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు