చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కారణజన్ముడు
కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం
కేసీఆర్ జన్మదినం, తెలంగాణ ప్రజలకు పర్వదినం
డబ్బు, మద్యం, బెదిరింపులు అక్రమాలు, అరాచకాలతో గెలిచిన కాంగ్రెస్
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్ యావత్ తెలంగాణ జాతికే రియల్ హీరో అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళ వారం నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావునోట్లో తలపెట్టి స్వరాష్ట్రం సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని రణనినాదం చేసి గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడం అసాధ్యం అనుకున్న తరుణంలో స్వరాష్ట్ర కాంక్ష రగిల్చి దానిని సుపాధ్యం చేసిన నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఒక ఉద్యమ కెరటంలా ఎగిసిపడి సబ్బండ వర్గాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించడమే కాక ఆంధ్ర పాలకుల కుట్రలకు ఎదురొడ్డి, కేంద్రం మెడలు వంచి, తెలంగాణను సాధించిన ఉద్యమ సూరీడు కేసీఆర్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన జన హృదయ నేత, తెలంగాణ జాతిపిత అని, కేసీఆర్ జన్మదినం, తెలంగాణ ప్రజలకు పర్వదినమని, ఆయురారోగ్యాలతో కేసీఆర్ నిండానూరేళ్ళు వర్ధిల్లాలని సబ్బండ వర్గాల ఆశీర్వాదం లభిస్తున్నదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ సూర్యుడు కేసీఆర్ కు నిజామాబాద్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉన్నదన్నారు.
తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయల్దేరిన ఆయనను ఇందూరు గడ్డ అక్కున చేర్చుకున్నదని నాటి పరిస్థితులను జీవన్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ స్థాపనతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్‌కు మొదట జేజేలు పలికింది వేల్పూర్ మండలంలోని మోతె గ్రామమన్నారు 2001 మే 5న ఇక్కడి మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ తెలంగాణ తెస్తానని శపథం చేశారన్నారు. బోధన్‌లో నిరాహార దీక్ష చేసి, ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతుల తరఫున పోరాడి, కామారెడ్డిలో ‘ధూం ధాం’ నిర్వహించి స్వరాష్ట్ర కాంక్షను సజీవంగా నిలిపారని ఆయన వివరించారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటి నడిచారని , ఆనాటి నుంచి జిల్లాతో మొదలైన ఉద్యమ అనుబంధం తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా కొనసాగుతున్నదన్నారు.
ఇందూరు గడ్డపై కేసీఆర్‌కు ఎంతో ఆప్యాయత ఉందని ,అందుకే మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆయన ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ శక్తిగా మారేందుకు దారి చూపిన ఊరు తమ ఆర్మూర్ అని ఆయన అన్నారు.ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్మూర్ తనదైన ముద్ర వేసుకున్నదని, అలాగే పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ ప్రాంతంతో విడదీయని అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు. 2013 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్‌లో
ప్రతినిధుల మహాసభ నిర్వహించామన్నారు .2014 మే 13న ఆర్మూర్‌కు వచ్చిన కేసీఆర్ మొదటి ఎమ్మెల్యే టికెట్‌కు తన పేరునే ప్రకటించడాన్ని జీవితంలో మర్చి పోలేనని జీవన్‌రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయాలను అందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లా ప్రజలదన్నారు. జాతీ య పార్టీలను సైతం కాదని బీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకున్నారన్నారు. ధరిత్రి దద్దరిల్లేల చేసిన మహోద్యమ నేత కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని ఆయన చెప్పారు. మళ్ళీ కేసీఆర్ సీఎం అయితేనే తెలంగాణకు స్వర్ణయుగం మొదలవు తుందన్నారు. మళ్లీ ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఇదిలాఉండగా గ్రామ పంచాయతీలు, మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉందన్నారు. డబ్బు, మద్యం, బెదిరింపులు అక్రమాలు, అరాచకాలతో గెలిచిన కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యం చేసిందని ఆయన మండిపడ్డారు. వచ్చేది బీ ఆర్ఎస్ ప్రభుత్వమేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.



