కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
కేసీఆర్, హరీశ్‌రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, తెలంగాణ ప్రజలకు వారు వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాంఢ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టారనీ, అయినా 90 శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్ల బిల్లులు ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. 45 టీఎంసీల లేఖ కొత్తది కాదనీ, 17 జనవరి 2024 ఫిబ్రవరిలో కేఆర్‌ఎంబీకి ఇచ్చామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దానినే లేఖలో ప్రస్తావించామని చెప్పారు. 90 టీఎంసీలను గతంలో కేసీఆరే డివైడ్ చేసి 45 టీఎంసీలుగా మార్చారని గుర్తు చేశారు.
కృష్ణా జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకాలు పెట్టారని ఉత్తమ్ అన్నారు. కృష్ణా నీటి వాటాలో 71 శాతం తెలంగాణకు, 29శాతం ఏపీకి ఇవ్వాలని పోరాడుతున్నామని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఏపీతో కుమ్మకై రోజుకు 3 టీఎంసీలు అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించామన్నారు. నల్లగొండ జిల్ల్లాకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ డిండికి అనుమతి ఇవ్వలేదనీ, మంత్రి కోమటిరెడి వెంకటరెడ్డిపై కోపంతో బ్రహ్మనవెల్లి ప్రాజెక్టుపై కుట్ర చేశారని విమర్శించారు. పదేండ్ల పాలనలో పాలమూరు, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
ప్రాజెక్టుకు కనీసం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే పాలమూరుకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం విషయంలోనూ బీఆర్‌ఎస్ పదే పదే తప్పుడు ప్రచారాలు చేస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజల తలను తాకట్టు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని విమర్శించారు. గత ఐదేండ్లలో 70 టీఎంసీల నీళ్లను మాత్రమే ఆ ప్రాజెక్ట్ నుంచి ఉపయోగించారన్నారు. బీఆర్‌ఎస్ చేసిన అప్పులు తీర్చడానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు పేరు మార్చుకుని గోబెల్స్ అని పెట్టుకోవాలని సూచించారు.



