Wednesday, January 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేసీఆరే దోషి

కేసీఆరే దోషి

- Advertisement -

ప్రాజెక్టులకు మరణశాసనం రాసింది ఆయనే
వాటిని ఏపీకి తనఖాపెట్టిన ఘనుడాయన
ప్రాణమున్నంత వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేస్తా
మా చిత్తశుద్ధిని శంకిస్తే తోలుతీస్తామన్న వారి నాలుకలు కోస్తా
బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపిస్తాం
‘నీళ్లు-నిజాలు’పై అసెంబ్లీలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రయివేటు యూనివర్సిటీల బిల్లు ప్రతిపాదన
ఉభయసభలు సోమవారానికి వాయిదా


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు మరణ శాసనం రాసిందే మాజీ సీఎం కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రాజెక్టును ఏపీకి తనఖా పెట్టిన ఘనుడాయనంటూ ఎద్దేవా చేశారు. చచ్చినా తెలంగాణ కోసమే.. బతికినా తెలంగాణ కోసమే..ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే పని చేస్తాం…’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ఆలోచనని ఆయన తెలిపారు. ‘దేవుడి మీద ఆన.. నేను ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనీయను…’ అని సీఎం భావోద్వేగంతో చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించొద్దని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. అలా చేస్తే తమ తోలు తీస్తామన్న వారి నాలుకలు కోస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.

శనివారం శాసనసభలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ‘నీళ్లు-నిజాలు’ అనే అంశంపై స్వల్పకాలిక చర్చను చేపట్టారు. అంతకుముందు సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను ఇచ్చారు. అనంతరం జరిగిన చర్చలో…కాంగ్రెస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు పాల్గొన్నారు. వారు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ… అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో కూడిన వివరాలను ఉదహరిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు. రాత్రి 7.22 గంటలకు మొదలైన ఆయన ప్రసంగం రాత్రి 10 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం… ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌పైన, మాజీ మంత్రి హరీశ్‌రావుపైన, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పైన ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ సభ్యులెవరూ సభకు రాకపోవటాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన విమర్శలను గుప్పించారు.

బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో రాష్ట్రం తరపున బలమైన వాదనలను వినిపించటం ద్వారా ఏడాదిలోగా అన్ని ప్రాజెక్టులకు అనుమతులు తెప్పిస్తామనే ఆశాభావాన్ని సీఎం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. తద్వారా వాటిని పూర్తి చేస్తామంటూ హామీనిచ్చారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎవ్వరితోనైనా కలబడతాం తప్ప తలవంచబోమని ఆయన స్పష్టం చేశారు. తనకంటే ఎంతో మంది సీనియర్లు, అనుభవజ్ఞులు, మేధావులు, ఉన్నత విద్యావంతులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకే దక్కిందని చెప్పారు. అలాంటి ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా కష్టపడతానని తెలిపారు. నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ అసెంబ్లీ బయట గగ్గోలు పెడుతున్న బీఆర్‌ఎస్‌ అధినేత, ఆ పార్టీ నేతలు.. సభకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు.

శాసననసభకే రానప్పుడు వారికి ఎమ్మెల్యే పదవులు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవులు ఎందుకంటూ ప్రశ్నించారు. గతంలో ఏపీ మాజీ సీఎం జగన్‌ను తన ఇంటికి పిలిపించి, పంచభక్ష పరమాన్నం పెట్టిన కేసీఆర్‌.. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు ఓకే చెప్పారంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి చేసి, కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి, ఆ స్కీమ్‌ను నిలుపుదల చేయించామని వివరించారు. ఇదీ తమ చిత్తశుద్ధంటూ వ్యాఖ్యానించారు. విషయం, సబ్జెక్టు ఉన్న వారిని వ్యక్తులుగా తాము గౌరవిస్తామని, అదే సమయంలో హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం తిరగబడతామని హెచ్చరించారు. అందువల్ల మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ హితవు పలికారు.

రూ.55 వేల కోట్ల కోసమే…
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జూరాల వద్ద ప్రారంభించాల్సిన దాన్ని, శ్రీశైలం వరకు పొడిగించటం వెనుక పెద్ద కతే ఉందని సీఎం ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లతో కలిసి రూ.55 వేల కోట్లను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ ఇలాంటి స్కెచ్‌ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దుర్మార్గం వల్ల ఆ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరారూ నీరివ్వలేదని విమర్శించారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ అనేది కేవలం తాగునీటి కోసం ఉద్దేశించి తప్ప సాగునీటి ప్రాజెక్టు కాదంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి సుప్రీంకోర్టు దాకా గగ్గోలు పెట్టింది బీఆర్‌ఎస్‌ నేతలు, ఆనాటి సీఎం కేసీఆర్‌ కాదా? అని ప్రశ్నించారు. వారు చేసిన ఈ నిర్వాకం వల్ల ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎత్తున పెనాల్టీలు విధించిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌కు సాగునీటిని ఇవ్వాలి, అక్కడకు పరిశ్రమలు రప్పించాలనే ఉద్దేశమే కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. అందువల్లే పాలమూరు-రంగారెడ్డిని పక్కనబెట్టారని విమర్శించారు.

బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర
ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం.. స్పీకర్‌ అనుమతితో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. ప్రయివేటు యూనివర్సిటీల బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

మాట్లాడే అర్హత, నైతిక హక్కు మీకుందా?
తెలంగాణకు, ఇక్కడి నీటి వాటాలకు అడుగడుగునా అన్యాయం చేసిన కేసీఆర్‌కు.. వాటి గురించి తమ ప్రభుత్వాన్ని అడిగే హక్కు, మాట్లాడే నైతిక అర్హత ఉన్నాయా? అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో గత 21 ఏండ్లుగా వ్యాజ్యాలు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. రాబోయే 20 ఏండ్ల కాలంలోనైనా అవి పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు.

అలాంటప్పుడు ఆ ట్రిబ్యునల్‌ చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటామంటూ మన నీటి హక్కులను ఆంధ్రాకు ఎలా తాకట్టు పెడతారంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి అనేది కేవలం తాగునీటి కోసమే ఉద్దేశించిందంటూ ఆనాటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డితో ఎన్జీటీలో పిటిషన్‌ వేసింది నిజం కాదా? అని నిలదీశారు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు నిజాలని, తానెక్కడి నుంచో ఆకాశం నుంచి తీసుకొచ్చి చెబుతున్న విషయాలు కావని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2015 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్సే కదా? మరి ఆ కాలంలో పాలమూరు-రంగారెడ్డికి ఎందుకు డీపీఆర్‌ తయారు చేయలేదంటూ ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -