Monday, December 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇరిగేషన్‌ను నాశనం చేసిందే కేసీఆర్‌

ఇరిగేషన్‌ను నాశనం చేసిందే కేసీఆర్‌

- Advertisement -

ఆయన వ్యాఖ్యల్లో 90 శాతం అబద్ధమే : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో ఇరిగేషన్‌ రంగాన్ని నాశనం చేసిందే కేసీఆర్‌ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డితో కేసీఆర్‌ కుమ్మక్కు అయి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నీటిపారుదల రంగంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్లో 90 శాతం అబద్ధమని కొట్టిపడేశారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అన్నారనీ, అది కూలిపోయిందని విమర్శించారు. రూ.1.80 లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోవడానికి కేసీఆర్‌నే కారణమని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్నా దేవాదుల, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. రెండున్నరేండ్లలో పూర్తిచేస్తామన్న ఎస్‌ఎల్‌బీసీ ఏమైందని నిలదీశారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం తీరును డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, సుప్రీంకోర్టు జడ్జి కూడా తప్పుపట్టారని ప్రస్తావించారు. కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇరిగేషన్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రూ.38,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారనీ, కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా పెంచారని ఆరోపించారు. రూ.18 వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.90 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడామనీ, కృష్ణాజలాలను రక్షించుకోవడం కోసం కేంద్రానికి లేఖలు రాశామని మీడియాకు చూపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న పెండింగ్‌ ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ హయాంలోనే ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల కోసం గట్టిగా ట్రిబ్యునల్‌లో కొట్లాడుతున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం రిజక్ట్‌ చేసిందనీ, అప్పుడు సీఎంగా కేసీఆర్‌ ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల కంటే తక్కువ అడగ లేదని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తప్పుల వల్లే ఇరిగేషన్‌ వ్యవస్థ నాశనమైందని నొక్కిచెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణకు 500 టీఎంసీల కంటే ఎక్కువ వాటా కావాలని పట్టుబట్టామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -