ఈసారి అసెంబ్లీ మరింత హీట్
‘నీటి వాటాల’ నిగ్గుతేల్చేపనిలో సీఎం
299 టీఎమ్‌సీల సంతకంపై నిలదీసే యోచన
బీసీ రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనా చర్చ
సర్, ఉపాధి హామీలపై తీర్మానాలు
ఎదురుదాడికి సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ నేతలు
ఈసారీ కేసీఆర్ డుమ్మానే!
ఆస్థానాన్ని భర్తీ చేసేందుకు హరీశ్‌రావు, కేటీఆర్ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇటీవల తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖరరావు (కేసీఆర్) ‘తోలుతీస్తా’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనికి కొడంగల్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ధీటైన సమాధానం చెప్పారు. ‘మటన్ షాప్ మస్తాన్‌కు చెప్తా…అక్కడి కెళ్లి తోలు తీరు’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యను సిల్లీగా తీసిపారేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేసీఆర్ లేవనెత్తిన నీటి వివాదాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రమ్మని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ఈసారి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఆయన స్థానంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కే తారకరామరావు నీటి పంపకాలపై చర్చలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలపై అప్పటి సీఎం కేసీఆర్ ఏకోన్ముఖంగా తీసుకున్న నిర్ణయాలు, పెట్టిన సంతకాలపైనే అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరగనుంది.
అయితే ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొడతామని ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూడా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించనుంది. దానితో పాటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ మారారని ఆరోపించబడిన ఎమ్మెల్యేల విషయంపైనా చర్చ జరగనుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ తీర్పును సభలో ప్రస్తావించాలని భావిస్తున్నారు. దీనిపై కూడా చర్చ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా ఆక్షేపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శాసనసభలో ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవు తున్నారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ చర్చకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే తెలంగాణ, ఏపీ నీటి వాటాలపై ఉన్నతాధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుని, దాన్ని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మొదటి దఫా ప్రభుత్వంలో ఏం జరిగింది? రెండోసారి ఏం చేశారనే విషయాలపై సీఎం దృష్టి సారించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపిన వైనం, దానికి బీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలు ఎలా కారణమయ్యాయో శాసనసభలోనే చర్చకు పెట్టనున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో కేసీఆర్ అంటకాగిన పద్ధతి, నీటి వాటాల్లో ఆ రాష్ట్రానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచే పనిలో ప్రభుత్వం ఉంది.
ఈ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతిపక్షానికి సభలో మాట్లాడే అవకాశం ఇస్తారా లేదా అనేదానిపై సందేహాలు ఉన్నాయి. నీటి వాటాలపై అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు ఇప్పటికే శాసనసభ స్పీకర్ ప్రసాదరావుకు లేఖ రాసారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావుకు ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) స్థానంలో ఇటీవల మోడీ సర్కార్ తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ బిల్లును కూడా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడివ్డ నిర్ణయించినట్టు తెలిసింది. రెండేండ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీకి ప్రధాన ఎజెండాగా మారి అసెంబ్లీ వేదికగా దీనిపై వాడివేడి చర్చ జరగనుంది.



