Saturday, January 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునదీ జలాలపై కేసీఆర్‌ మాట్లాడాలి

నదీ జలాలపై కేసీఆర్‌ మాట్లాడాలి

- Advertisement -

హరీశ్‌రావుకు అప్పగిస్తే అంతా మ్యాచ్‌ ఫిక్సింగే
బిడ్డగా చెబుతున్నా…. నాన్న అసెంబ్లీకి రావాలి
కౌన్సిల్‌లో రాజీనామా కారణాలు వివరిస్తా : కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నదీ జలాల అంశంపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పక్షానా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ మాట్లాడితేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌లో బబుల్‌ షుటర్‌ హరీశ్‌రావును డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ చేశారనీ, జలాలపై ఆయన చేత మాట్లాడిస్తే అంతా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే హరీశ్‌రావు సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారని ఆమె ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులో ప్యాకేజ్‌ను హరీశ్‌రావు అమ్ముకున్నారని ఆరోపించారు. తన తండ్రి కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆమె ఆకాంక్షించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోతే బీఆర్‌ఎస్‌ను ఆ దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. గతేడాది సెప్టెంబర్‌ 3న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆ రాజీనామాను శాసనమండలి చైర్మెన్‌ ఇప్పటికీ ఆమోదించలేదు.

ఈ నేపథ్యంలో శుక్రవారం కవిత శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో భేటీ అయ్యారు. తాను రాజీనామా చేసేందుకు దారి తీసిన కారణాలను చెప్పుకునేందుకు కౌన్సిల్‌ లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆమె మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ తన కోరికను మన్నించి జనవరి 5 లేదా 6వ తేదీల్లో ఒక రోజు హౌస్‌లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తానని చైర్మెన్‌ మాటిచ్చినట్టు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మెన్‌ను కోరినట్టు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన భాషను మార్చుకోవాలని కవిత సూచించారు. ప్రతిపక్ష నాయకులను తీవ్రవాదులతో పోల్చుతారా? అంటూ ప్రశ్నించారు. 12 సంవత్సరాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారలేదని స్పష్టం చేశారు. జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్‌టేక్‌ పాయింట్‌ ఎందుకు మార్చారో కేసీఆర్‌ మాత్రమే చెప్పగలరన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవని తప్పుపట్టారు.

ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్‌పై చేసిన విమర్శలకు తన రక్తం మరుగుతోందని చెప్పారు. కేసీఆర్‌ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అంతటి స్థాయి కలిగిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌ రెడ్డికి లేదని కొట్టిపారేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చట్టపరమైన చిక్కులున్నాయని కాంగ్రెస్‌ సర్కారు సాకులు చెబుతోందనీ, అయితే బీమా, నెట్టంపాడు, సుందిళ్ల, కల్వకుర్తికి ఏమైంది? కల్వకుర్తిలో రెండు మోటార్ల రిపేర్‌కు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. బీమా, నెట్టంపాడులో సగం సామర్థ్యం మేర కూడా నీళ్లు లేవని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇన్‌టెక్‌ సోర్స్‌ను మార్చాలని ఆమె డిమాండ్‌ చేశారు. 27 వేల ఎకరాలు భూసేకరణ చేసి ఒక్క కాలువ నిర్మించకుండా, డిప్యూటీ సీఎం 12 వేల ఫైళ్లను పెండింగ్‌లో పెట్టుకున్నారని ఆమె దుయ్యబట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బలమైన ప్రజాశక్తిగా పోటీలో ఉంటుందని కవిత ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -