నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు (గురువారం) ఉదయం మరోసారి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యం కారణంగా రెండు రోజుల పాటు ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఆరోగ్య పరిస్థితిని తిరిగి మానిటర్ చేయడానికి ఇవాళ ఆస్పత్రికి వెళ్లనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్యం స్థిరంగా ఉన్నప్పటికీ, మున్ముందు మరింత జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచించిన నేపథ్యంలో కొన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లనున్నారు.
వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు తిరిగి వెళ్లనున్నారని సమాచారం. అక్కడే ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశముంది. పార్టీ కార్యకలాపాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్య ప్రత్యక్షం కావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.