– మూసీ, హైడ్రా బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు
– బాధితులతో కలిసి దీపావళి వేడుకలు
నవతెలంగాణ – శేరిలింగంపల్లి, గండిపేట
”మరో రెండేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది.. కేసీఆర్ మళ్లీ సీఎంగా వస్తారు.. అప్పుడు మూసీ, హైడ్రా బాధితులకు ఇండ్లు ఇస్తాం” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. వారు మూసీ, హైడ్రా బాధితులతో కలిసి సోమవారం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో నివసి స్తున్న హైడ్రా బాధితులను కేటీఆర్ పరామర్శించి స్వీట్లు, టపాసులు పంపిణీ చేశారు. అలాగే, గండిపేట మండలం హైదర్‌షాకోట్‌లో మూసీ సుందీరకరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులతో కలిసి హరీశ్‌రావు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీపావళి అంటేనే నరకాసుర వధ అని, నరకాసుర వంటి కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో అంతమవుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. కొత్తగా ఇండ్లు ఇవ్వకపోగా ఉన్నవే కూలుస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలన పట్ల ప్రజల్లో తిరుగుబాటు మొదలయిందన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష ఇండ్లు కట్టారని, ఇందులో తాము 60వేల ఇండ్లు పంపిణీ చేశామని చెప్పారు. మిగిలిన 40వేల ఇండ్లు అలాగే ఉన్నాయని, వాటిని పేదలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. మూసీ సుందరీకరణకు గతంలోనే కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దారుణమన్నారు. హైడ్రా కమిషనర్‌కు రేవంత్‌రెడ్డి సోదరుడి ఇల్లు, పొంగులేటి, మహేందర్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి నయా నరకాసురుడుగా మారారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సర్కార్ పడిపోయినప్పుడే నిజమైన దీపావళి అన్నారు. మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనల్లో వారి వెంట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు ఉన్నారు.
కేసీఆర్ మళ్లీ వస్తారు.. మీకు ఇండ్లు వస్తాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES