తెలంగాణ, ఏపీ సీఎంలు సహా పలువురి ప్రముఖుల శుభాకాంక్షలు
ధన్యవాదాలు తెలిపిన బీఆర్‌ఎస్ అధినేత
సీఎంను చేయడమే కేసీఆర్‌కు ఇచ్చే కానుక : కేటీఆర్
తెలంగాణ భవన్‌లో 72 కిలోల కేక్ కట్ చేసిన బీఆర్‌ఎస్ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కేసీఆర్‌కు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఎ రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పవన్ కళ్యాణ్, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి నారా లోకేశ్, తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, కేంద్ర మంత్రి బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ భవన్‌లో వేడుకలు
కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, బీఆర్‌ఎస్ నేత తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు అతిథులుగా హాజరయ్యారు. కేసీఆర్ 72వ జన్మదినోత్సవం సందర్భంగా 72 కిలోల కేక్‌ను కట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్‌రెడ్డి, తెలంగాణ భవన్ ఇన్‌చార్జీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ప్రజలే పిలిచారు : కేటీఆర్
తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంటే కేసీఆర్ సాహసం, చరిత్ర తెలుస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొండి ధైర్యంతో ఉక్కు సంకల్పంతో ముందుకు నడిచారని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించాక పదేండ్లు దేశానికే దిక్సూచిగా పాలన అందించారని వివరించారు. ‘రాజ్యతంత్రం నడిపిన రాణిరుద్రమ్మ జాతి మాది, జల్, జంగిల్, జమీన్ కోసం కొట్లాడిన కొమురం భీం జాతి మాది, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మ జాతి మాది, భూముస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది, బందూకు చేతపట్టి దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ జాతి మాది, సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది, సిపాయిల తిరుగుబాటు బావుట ఎగరవేసిన తుర్రేబాజ్‌ఖాన్ జాతి మాది, కాళోజీ, దాశరథి, అమరవీరుల జాతి మాది’అని కేటీఆర్ అన్నారు.
ఢిల్లీ అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదని చెప్పారు. రాష్ట్రంలో రెండే జాతులున్నాయనీ, తెలంగాణ వాదుల జాతి, ద్రోహుల జాతి అని వివరించారు. కేసీఆర్‌ది ఫైటర్ల జాతి, రేవంత్‌ది ట్రెయిటరల జాతి అని అన్నారు. తెలంగాణ జాతిపిత అని కేసీఆర్ ఏనాడు చెప్పలేదనీ, ప్రజలే ఆయన్ను అలా పిలుచుకున్నారని గుర్తు చేశారు. ఐక్యంగా కొట్లాడుదామనీ, రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేయడం, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే ఆ మహానాయకుడికి ఇచ్చే చిరుకానుక అని చెప్పారు.
కేసీఆర్ కారణజన్ముడు : హరీశ్‌రావు
ఇది కేసీఆర్ పుట్టినరోజు కాదనీ, ఉద్యమం పుట్టిన రోజని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆయన కారణజన్ముడని చెప్పారు. చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ అని వివరించారు. త్యాగాల పునాదుల మీదు తెలంగాణను సాధించారని అన్నారు. ఓటమి తాత్కాలికమనీ, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. ఒక్క తాటిపై నడుద్దామనీ, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు.



