నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయన నివాసం వద్ద ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాల బృందం పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం చైర్మన్ ఎస్. కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. పూజారుల సేవలను గుర్తించి వారి భృతిని రూ.2,500 నుండి రూ.6,000 వరకు పెంచడమే కాక, అవసరమైతే రూ.10,000 వరకూ అందిస్తానని హామీ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
అలాగే పూజారులకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ధూప, దీప, నైవేద్య కార్యక్రమాల అనంతరం అర్చకులు కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, “శతమానం భవతి” అంటూ వేద ఆశీర్వచనాలు అందించారు.
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ అనేక యాగాలు నిర్వహించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేశారని తెలిపారు. ప్రతి గ్రామంలో అర్చకులకు గౌరవప్రదమైన జీతభృతి అందించాలనే సంకల్పాన్ని ఆచరణలో చూపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని గౌరవప్రదంగా నిలబెట్టిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్లు గిరిగంటి లక్ష్మీనారాయణ, హరికెల ప్రభాకర్ యాదవ్, పిట్ల వేణుగోపాల్, బి ఆర్ ఎస్ నాయకులు గైనీ శ్రీనివాస్ గౌడ్, నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



