నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో చండీ యాగం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు యాగానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిబ్బంది పూర్తి చేశారు. మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్, శోభ దంపతులు ప్రధాన కర్తలుగా ఇవాళ ఉదయం 11.30కి చండీయాగం క్రతువు ప్రారంభమై సాయంత్రం 5.30కి ముగియనుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రతికూల వాతావరణం, కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ చండీ యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, గత నాలుగు రోజుల నుంచి కేటీఆర్ దంపతులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు అక్కడే ఉన్నారు. ఇవాళ జరిగే చండీయాగానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తదితరులు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, వాస్తవానికి ఆగస్టు 6న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం నిర్వహించాల్సి ఉండగా.. కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.