Wednesday, October 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకలలు కంటూనే ఉండండి

కలలు కంటూనే ఉండండి

- Advertisement -

ట్రంప్‌ వాదనపై ఖమేనీ ఎద్దేవా ొ మా స్థావరాలతో నీకేం పని?
– ఉగ్రవాద గ్రూపులను పశ్చిమాసియా పైకి ఉసిగొల్పుతున్నావు
– ఉగ్రవాది అమెరికాయే
– వాషింగ్టన్‌తో అణు చర్చలు ఉండవు

టెహ్రాన్‌ : అణు చర్చలు ప్రారంభిద్దామంటూ అమెరికా అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతి పాదనను ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ తోసిపుచ్చారు. ఈ ఏడాది జూన్‌లో జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌ అణు స్థావరాలను ధ్వంసం చేశామంటూ ట్రంప్‌ చేసిన వాదనను ఖండిస్తూ ‘అలా కలలు కంటూనే ఉండండి’ అని ఎద్దేవా చేశారు. తనతో కుదుర్చుకునే ఒప్పందం ఫలితాన్ని అమెరికా ముందుగానే నిర్దేశిస్తోందని, బెదిరింపులకు దిగుతోందని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇరాన్‌, అమెరికా దేశాలు ఐదు విడతలుగా పరోక్ష అణు చర్చలు జరిపాయి. అయితే జూన్‌లో 12 రోజుల పాటు అమెరికా జరిపిన వైమానిక దాడులతో అవి నిలిచిపోయాయి. ఆ సమయంలో ఇజ్రాయిల్‌, అమెరికా దళాలు ఇరాన్‌ అణు స్థావరాలపై బాంబు దాడులు జరిపిన విషయం తెలిసిందే.
‘ఒప్పందాన్ని తానే రూపొందిస్తానని ట్రంప్‌ అంటారు. అయితే బలవంతంగా రుద్దినప్పుడు, దాని ఫలితాన్ని ముందుగానే నిర్ణయించినప్పుడు అది ఒప్పందం ఎలా అవుతుంది? అది బలవంతంగా రుద్దడం లేదా బెదిరించడం అవుతుంది’ అని ఖమేనీ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చిస్తే బాగానే ఉంటుందని గత వారం ఇజ్రాయిల్‌ పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్‌ వ్యాఖ్యా నించారు. దీనిపై ఖమేనీ స్పందిస్తూ ‘ఇరాన్‌ అణు పరిశ్రమపై బాంబు దాడులు జరిపి దానిని ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు గొప్పగా చెప్పారు. మంచిదే. అలాగే కలలు కంటూ ఉండండి’ అని ఎత్తిపొడిచారు. ఇరాన్‌కు అణు స్థావరాలు ఉన్నా లేకున్నా అమెరికాకు ఏం పని అని నిలదీశారు. ఇలా జోక్యం చేసుకోవడం సరికాదని, తప్పని హితవు పలికారు. తప్పుడు అంచనాలతో ఇరాన్‌ ప్రజల నైతిక స్థైరాన్ని ట్రంప్‌ దెబ్బ తీసేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. ‘ఎలాంటి ఆయుధాలు ఉపయోగించ కుండా, సైన్యాన్ని దింపకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించు కోవడానికి యుద్ధం చేసే శత్రువు ప్రజలను ఒత్తిడికి గురిచేస్తాడు. తమ సామర్ధ్యంపై నమ్మకం కోల్పోయేలా చేస్తాడు. ఆక్రమిత పాలస్తీనాలో నిరాశకు గురైన యూదుల్లో స్థైరాన్ని నింపి, వారిలో ఆశలు కలిగిం చేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు. అందుకోసం ఎన్నో ఉత్తుత్తి మాటలు చెప్పారు. ఓ విదూషికుడిలా మారారు. ఆక్రమిత పాలస్తీనాలో అమెరికా అధ్యక్షుడి పర్యటనపై ఇది నా అభిప్రాయం’ అని తెలిపారు. పన్నెండు రోజుల పాటు ఇరాన్‌ జరిపిన దాడిలో ఇజ్రాయిల్‌ దళాలు ఊహించలేని, కోలుకోలేని దెబ్బ తిన్నాయని ఖమేనీ చెప్పారు. ‘ఆ ఎదురు దెబ్బలను వారు ఊహించలేదు. ఆశలు వదులుకున్నారు. ఆ నిరాశా నిస్పృహల నుంచి వారిని బయటపడేసేందుకు ట్రంప్‌ ఆక్రమిత పాలస్తీనాలో పర్యటించారు. ఇరాన్‌ దళాలు అనేక ఇజ్రాయిల్‌ ముఖ్య కేంద్రాలను సమూలంగా ధ్వంసం చేశాయి’ అని అన్నారు. అమెరికాను ఓ ఉగ్రవాద దేశంగా ఆయన అభివర్ణిస్తూ గాజాలో జరుగుతున్న యుద్ధ నేరాల్లో అమెరికా భాగస్వామి అని ధ్వజమెత్తారు. ఉగ్రవాదంతో పోరాడుతు న్నానని చెబుతున్న అమెరికా… గాజాలో 20 వేల మంది చిన్నారులను, శిశువులను పొట్టన పెట్టుకున్నదని మండిపడ్డారు. ఈ చిన్నారులంతా ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. అసలైన ఉగ్రవాది అమెరికాయేనని స్పష్టం చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఊతమిస్తున్న అమెరికా వాటిని పశ్చిమాసియా పైకి ఉసిగొల్పుతోందని ఖమేనీ ఆరోపించారు. ఏదో ఒక రోజు వాటిని రంగంలోకి దింపుతుందని చెప్పారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ ది లెవెంట్‌ (ఐఎస్‌ఐఎల్‌) అనే ఉగ్రవాద గ్రూపు ప్రస్తుతం అమెరికా చెప్పుచేతల్లో ఉన్నదని, అది కోరుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో దానిని ఉపయోగించుకుం టుందని ఖమేనీ తెలిపారు.

జపాన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి మహిళ తకైచి
టోక్యో (జపాన్‌) : జపాన్‌ లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. ఈమె ఆ దేశానికి తొలి మహిళా కావడం విశేషం. పార్లమెంటులోని దిగువ సభ 465 ఓట్లలో తకైచి 237 ఓట్లను గెలుచు కున్నారు. దిగువ సభలో జరిగిన మొదటి రౌండ్‌ ఓటింగ్‌లో కాన్‌స్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాయకుడు యోషిహికో నోడాకు 149 ఓట్లు రాగా, ఎల్‌డిపి పార్టీ అభ్యర్థి తకైచి 237 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీ క్యోడో తెలిపింది. కాగా, ప్రధానిగా తకైచి ముందు అనేక సవాళ్లున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం, అవినీతి కుంభకోణాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు… ఇన్ని సవాళ్ల మధ్య సనై తకైచి ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -