మంత్రిగా అజహరుద్దీన్ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మైనార్టీ, ప్రభుత్వ రంగ సంస్థల శాఖలమంత్రిగా మహమ్మద్ అజహరుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 31న మంత్రిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత మంత్రిగా ప్రమాణం చేయించగా, నవంబర్ 4న ఆయనకు శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్థకశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.



