Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంమానవ వికాసాభివృద్ధిలో కేరళ భేష్‌

మానవ వికాసాభివృద్ధిలో కేరళ భేష్‌

- Advertisement -

ప్రఖ్యాత పాత్రికేయులు ఎన్‌ రామ్‌ ప్రశంసలు
దేశాభివృద్ధికి కేరళ, తమిళనాడు రోల్‌మోడల్‌

తిరువనంతపురం : అత్యున్నతస్థాయి మానవ వికాసాభివృద్ధి సమాజానికి దేశంలోనే కేరళ అత్యంత సమీప్యంగా ఉందని ప్రఖ్యాత పాత్రికేయులు, ద హిందూ గ్రూపు సంస్థల డైరెక్టర్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు. ఆదాయ వనరులు తక్కువగా ఉన్నా సామాజిక రంగ పెట్టుబడులు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ద్వారా అసాధారణ ఫలితాలు సాధించగలమని కేరళ నిరూపించిందని కొనియాడారు. ‘విజన్‌ 2031 : అభివృద్ధి – ప్రజా స్వామ్యం’ అనే అంశంపై తిరువనంతపురం లో మూడు రోజులుగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు చివరి రోజైన మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భాగంగా ‘లౌకికవాదం, ప్రజాస్వామ్యం, కన్సల్టేటివ్‌ గవర్నమెంట్‌’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో రామ్‌ ప్రసంగించారు. కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, లోక్‌సభ ఎంపీ కనిమొళి (వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా), సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్‌ రామ్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు వృద్ధిలో పయణించడానికి కేరళ, తమిళనాడు రెండింటి నుంచి పాఠాలు నేర్చుకోవాలనే అవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. కేరళలో బహుముఖ పేదరికం అత్యల్పంగా ఉందని, ఇప్పటికే తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రంగా ఖ్యాతి గడించిందని అన్నారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు అత్యల్పంగా ఉందన్నారు. సార్వత్రిక అక్షరాస్యత, పటిష్టమైన సామాజిక రక్షణ, సాధికారత కలిగిన స్థానిక స్వపరిపాలన ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు గొప్ప ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉన్న దేశాలతో పోటీ పడి కేరళ మానవాభివృద్ధి సాధిస్తోందని, అనేక అడ్డంకులున్నా..ప్రజలకు మేలు చేయాలన్న ధృడ సంకల్పం ప్రభుత్వానికి ఉంటే అద్భుతాలు సాధించవచ్చునని కేరళ నిరూపించిందని అన్నారు.

‘కేరళ అభివృద్ధి నమూనా’ గురించి గొప్పలు ప్రచారం చేయవద్దంటూ గతంలో నాటి ముఖ్యమంత్రి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ చెప్పిన మాటలను ఎన్‌ రామ్‌ గుర్తు చేస్తూ నిరుద్యోగం నిర్మూలన, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక ఒత్తిళ్లు వంటి విషయాల్లో ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉందని తెలిపారు. తమిళనాడు బలమైన సామాజిక విధానాన్ని, వైవిధ్యభరితమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను సమ్మిళితం చేస్తూ రెండవ మార్గాన్ని సూచిస్తుందని రామ్‌ చెప్పారు. ఆరోగ్య రంగంలో తమిళనాడు సాధిస్తున్న ఫలితాలు దేశంలోనే అత్యుత్తమమైనవని, ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి 50 శాతానికి దగ్గరగా ఉందని అన్నారు. అంతేకాకుండా, దేశం మొత్తం తయారీ రంగంలో పనిచేసే మహిళల్లో 40 శాతానికి మంది తమిళనాడులోనే పనిచేస్తున్నారని తెలిపారు. ఎంపీ
కనిమొళి ప్రసంగిస్తూ.. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తిపై దాడి జరుగుతోందని, దీనిని పౌర సమాజం, రాజకీయ పక్షాలు ప్రతిఘటించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఫాసిస్టు ధోరణలు పెరిగిపోతున్నాయి : ఫరూక్‌ అబ్దుల్లా
దేశంలో ఫాసిస్టు ధోరణలు, అధికార కేంద్రీకరణ, ప్రజాసామ్య చర్చల్లో సత్యాలు మాట్లాడే గొంతులను అణిచివేయడం, మతాల పేరిట విభజన వంటివి పెరిగిపోతున్నాయని జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పౌరులంతా ఏకతాటిపై నిలువాల్సిన అవసరాన్ని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి..అడ్డంకులు సృష్టించినా..ప్రతి మతాన్ని, ప్రతి మానవుడిని గౌరవించడం ద్వారా మత సామరస్యాన్ని పెంపొందించి, సమ్మిళిత అభివృద్ధి సాధించడమే గాక తీవ్ర పేదరికాన్ని నిర్మూలించి కేరళ విజయపథంలో పయణిస్తోందని ఆయన ప్రశంసించారు.

దేశంలో క్రమేపీ సమాఖ్య నిర్మాణం బీటలు బారుతోందని ఫరూక్‌ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పుడు ప్రతి అంశంలోకి చొరబడుతోందని, రాష్ట్రాలకు నిర్దేశించిన అంశాల్లోనూ జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ, ఆర్టికల్‌ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ.. ఈ నిబంధనలే ఉగ్రవాదానికి కారణాలని, వాటిని రద్దు చేశారు మరి ఇప్పుడు ఉగ్రవాదం అదృశ్యమైందా అని ఆయన ప్రశ్నించారు. పుల్వామాలో జరిగిన దాడుల గురించి కేంద్రం ఏం సమాధానమిస్తుందని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసి కీలక నిర్ణయాలన్నింటినీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారానే నడిపిస్తున్నారని తప్పుబట్టారు.

ఉత్తరాది ప్రజల్లో భయం…దక్షిణాది ప్రజల భరోసా
ఉత్తరాది ప్రజలు వివక్ష, భయాన్ని అనుభవిస్తున్నారని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. వాస్తవానికి హిందూవుల్లో మెజారిటీ ప్రజలు మతతత్వానికి చెందినవారు కాదు..కానీ భయం మమ్మల్ని మూలకు నెట్టివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తమకు దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ‘మీరు ఇచ్చిన బలంతోనే స్వేచ్ఛగా నడవగలిగే..స్వేచ్ఛగా మాట్లాడగలిగే..స్వేచ్ఛగా ఆలోచించే రోజు కోసం వేచిచూస్తున్నాం’ అని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆందోళనకరం
అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంలోని షరతులపైనా ఫరూక్‌ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒప్పందంలోని అంశాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందం రైతులకు, ఆర్థికంగా బలహీన రాష్ట్రాలకు పెను విఘాతమని తెలిపారు. సహజ సౌందర్యంతో విలసిల్లే తమ రాష్ట్రంలో యాపిల్‌, వాల్‌నట్స్‌, బాదం విస్తారంగా పండిస్తామని, అమెరికాతో ఒప్పందం కారణంగా ఇవి పండించే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కారణంగా హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి వ్యవసాయం, ఉద్యాన వనాలపై ఆధారపడిన ఇతర ప్రాంతాలపై వినాశకర ప్రభావం పడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -