Thursday, January 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్లాస్టిక్‌ నియంత్రణలో కేరళ దిక్సూచి

ప్లాస్టిక్‌ నియంత్రణలో కేరళ దిక్సూచి

- Advertisement -

మన దేశంలో ప్లాస్టిక్‌ నియంత్రణ పెను సవాల్‌గా మారింది. జీవరాశి మనుగడకు ఇది ముప్పుగా మారింది. అయినప్పటికీ రోజు రోజుకూ ప్లాస్టిక్‌ వినియోగం పెరుగూతూనే ఉంది. గ్రామాలు, పట్టణాల్లోనే కాకుండా నేడు అటవీ ప్రాంతాలను సైతం కలుషితం చేస్తోందీ మహమ్మారి. భూమిపై జీవించే జీవరాశులే కాకుండా, జలచరాశులు సైతం ప్లాస్టిక్‌ భూతానికి బలౌతున్నాయి. ప్రధానంగా కుంభమేళాలు, ప్రధాన దేవాలయ పరిసరాలు, జాతరల్లో వాతవారణ కాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. ఇందుకు భిన్నంగా కేరళ రాష్ట్రంలోని శబరిమలలో ఆ ప్రభుత్వం ప్లాస్టిక్‌ నియత్రణకు తీసుకున్న చర్యలు..పర్యావరణ హితానికి దోహదపడుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు లెఫ్ట్‌ సర్కారు దిక్సూచిగా నిలుస్తోంది. 100 నుండి 500 ఏళ్ల వరకు ప్లాస్టిక్‌ భూమిలో కలిసి పోకుండా అలాగే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. భూమినే కాకుండా నీరు, వాయువునూ కలుషితం చేస్తుంది ప్లాస్టిక్‌.

ఇది తెలిసినప్పటికీ..ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించ లేకపోతున్నాయి ప్రభుత్వాలు. లక్షల్లో భక్తులు దర్శించుకునే ప్రధాన ఆలయాలు, జాతరలు, కుంభమేళాలు లాంటి ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే శబరిమలలో ప్లాస్టిక్‌ కట్టడికి తీసుకున్న చర్యలు..ఇతర రాష్ట్రాలకు అనుసరనీయమని చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకునే క్రమంలో అటవీ ప్రాంతం ప్లాస్టిక్‌ మయంగా మారేది. ఈ నేపథ్యంలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎరుమేళి, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నియత్రణకు విస్తృత తనిఖీలు చేపట్టి నియంత్రించగలిగింది. ప్లాస్టిక్‌ను నిరోదించడంతో పర్యావరణం కొంత దెబ్బతినకుండా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో గతంలో నిర్వహించిన కంభమేళలో పారిశుధ్య పరిస్థితి తెలిసిందే. ప్లాస్టిక్‌తో పాటు ఇతర వ్యర్థాల తొలగింపుపై అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతం కలుషితంగా మారింది. గంగా, యమున నదీ ప్రాంతాలు కనీసం స్నానం చేసేందుకు వీలు లేకుండా ఉందనే విమర్శలొచ్చాయి. మల కొలీఫాం బ్యాక్టీరియా, ప్లాస్టిక్‌. ఇతర చెత్తతో కోట్లాది మంది ప్రజలు అనారోగ్యపాలయ్యారు. బీజేపీ ప్రభుత్వం ప్రచారంపై చూపిన శ్రద్ధ సౌకర్యాల కల్పనలో చూపలేదనేది స్ఫష్టమైంది.

ఈ సమస్యలన్నీ ఎక్స్‌పోజ్‌ కాకుండా యూపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో మినీ కుంభమేళ జరుగుతోంది. ప్రతీ రెండేండ్లకోసారి మేడారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో ఈ జన జాతర జరుగుతూ ఉంటుంది. ఈ నెల 28 నుండి 31 వరకు సమ్మక్క-సారక్క జాతర జరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య సమస్య పెను సవాల్‌గా మారింది. ప్రధానంగా మేడారంలో ప్లాస్టిక్‌ వినియోగం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ప్లాస్టిక్‌ నిషేదం అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా.. కార్యాచరణలో చూపడం లేదు. కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా వేసిన సర్కార్‌..ప్లాస్టిక్‌ నియంత్రణకు పెద్దగా తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో గతంలోలా ఈ సారి కూడా మేడారంలో పది వేల టన్నుల ప్లాస్టిక్‌ పేరుకపోనుంది. ఈసారి కూడా ప్లాస్టిక్‌ను ఏరివేయడం, రీసైక్లిన్‌ చేయడం సవాల్‌గా మారనుంది.

జంపన్న వాగులో షాంపూలు, సబ్బు కవర్లు, ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు వేస్తుంటారు. వీటివల్ల జలచరాలు అంతరించిపోతాయి. తాడ్వాయి, ఏటూరు నాగారం అటవీ ప్రాంతాలపై పారిశుధ్య ప్రభావం పడుతుంది. దీంతో కోతులు, జింకలు, వన్యప్రాణుల మనుగడ కష్టంగా మారుతుంది. స్వచ్ఛమైన గాలి, నీరు, సారవంతమైన భూమితో ఉండాల్సిన అటవీ ప్రాంతాలు..జాతర పేరుతో కలుషితం కావడం వల్ల ఆయా ప్రాంతాల గిరిజనుల జీవనం ప్రమాదకరంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వం కేరళ సర్కారును స్ఫూర్తిగా తీసుకుని శబరిమల తరహాలో మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సి ఉంది. రోడ్డు రవాణా సంస్థ, దేవాదాయ, పోలీసు, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌.. ఇలా ఆయా శాఖల సమన్వయం, అధికారులు పక్కా ప్రణాళికతో వివిధ మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువులు మేడారానికి రాకుండా నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

చిలగాని జనార్ధన్‌, 8121938106

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -