Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయం'ఉపాధి'లో కేరళ ఆదర్శం

‘ఉపాధి’లో కేరళ ఆదర్శం

- Advertisement -

కేంద్రం కోతలు విధించినా ఉపాధి పనిదినాలు అధికం
4.41 కోట్ల అదనపు పనిదినాల సృష్టి
19.44 లక్షల కుటుంబాలకు లబ్ది
సత్ఫలితాలిచ్చిన కేరళ ట్రైబల్‌ ప్లస్‌ పథకం
కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో కార్మికుల ఆందోళనలు

తిరువనంతపురం: జాతీయ ఉపాధి హామీ చట్టం అమలులో కేరళ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా, వాటన్నింటినీ ఛేదించుకొని, రాష్ట్ర ప్రజలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉపాధి హామీ కార్యక్రమానికి భారీగా నిధుల కోతలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక నిర్భంధాలను తట్టుకుంటూనే గడిచిన ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కేటాయింపులకు అదనంగా కేరళ రాష్ట్రం 4.41 కోట్ల అదనపు పని దినాలను సృష్టించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద 51 కోట్ల పనిదినాలను మంజూరు చేసింది. కేరళ రాష్ట్రం ఆ పరిమితిని అధిగమించి 53.5 కోట్ల పనిదినాలను సృష్టించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ కాలంలో కార్మికులకు రూ. 17,216.57 కోట్ల వేతనాలు చెల్లించారు. దీనితో పాటు, అయ్యన్‌కాళి పట్టణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఐదేండ్లలోనే మరో 1.91 కోట్ల పనిదినాలను కల్పించారు.

వీటి అమలు కోసం మున్సిపాల్టీలు రూ.634.01 కోట్లు ఖర్చు చేశాయి. దీనివల్ల కేరళలోని 19.44 లక్షల కుటుంబాలు లబ్ది పొందాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడాన్ని, కార్మికుల హక్కులను బలహీనపరిచే కార్మిక కోడ్‌ల అమలును వ్యతిరేకిస్తూ కేరళలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ కార్మిక సంఘాలు మంగళవారం ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. వీటిని కేరళ రాష్ట్ర కర్షక తోజిలాలి యూనియన్‌ (కేఎస్‌కేటీయూ), భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ రెండు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. వీబీజీ రామ్‌ జీ చట్టంతో ముందుకు వెళ్లాలన్న కేంద్ర నిర్ణయం సమాజంలోని అత్యంత పేద వర్గాల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంపై ప్రజా వ్యతిరేక చట్టాలను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ బలమైన, నిరంతర నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

ఆర్థికసాయంలో కోతలు పెట్టినా..
కేంద్రం పనిదినాల కేటాయింపులు, ఆర్థిక సహాయంలో నిరంతర కోతలు విధిస్తున్నప్పటికీ కేరళలో ఉపాధి విస్తరణ జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల పనిదినాలుగా ఉన్న కార్మిక బడ్జెట్‌ను 2025-26 నాటికి 5 కోట్లకు తగ్గించారు. ప్రస్తుతం, ఈ పథకం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నిధులలో కేవలం నాలుగో వంతు మాత్రమే కేంద్రం మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే.

‘ఉపాధి హామీ పరిరక్షణ’ సభలు
ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడానికి, గ్రామీణ జీవనోపాధిని దెబ్బతీయడానికి కేంద్రం పద్ధతి ప్రకారం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సోమవారం కేరళ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఎన్‌ఆర్‌ఈజీ కార్మికుల సంఘం నాయకత్వంలో, రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ వార్డులలో ఉపాధి హామీ పరిరక్షణ సభలు నిర్వహించారు. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద పూర్తి ఆర్థిక బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండేది. అయితే మోడీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చట్టపరమైన నిబంధనల్లో ఖర్చు భారాన్ని 40 శాతం రాష్ట్రాలపైకి మార్చారు. ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలో కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

ప్రతి కుటుంబానికి అధిక పనిదినాలు
ఈ పరిమితుల మధ్య కేరళ ప్రతి కుటుంబానికి సగటున అధిక పనిదినాలను అందించడంలో విజయం సాధించింది. ఎక్కువ కుటుంబాలు పూర్తి 100 రోజుల ఉపాధిని పొందేలా చేసింది. ఇది మరే ఇతర రాష్ట్రానికి సాధ్యం కాని ప్రత్యేకత. కేంద్రం ప్రతి కుటుంబానికి 100 పనిదినాలకు మాత్రమే వేతన చెల్లింపులను పరిమితం చేయగా, కేరళ ఒక అడుగు ముందుకు వేసి, అన్ని షెడ్యూల్డ్‌ తెగల కుటుంబాలకు 200 పనిదినాలకు హామీ ఇవ్వడానికి రాష్ట్ర నిధులను కేటాయించింది. అదనంగా 100 పనిదినాలను అందించడానికి కేరళ ట్రైబల్‌ ప్లస్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పూర్తి సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -