Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలురవాణారంగంలో కేరళ ఆదర్శం

రవాణారంగంలో కేరళ ఆదర్శం

- Advertisement -

– అక్కడి ఆర్టీసీకి పదేండ్లలో రూ.11వేల కోట్లు విడుదల : కేరళ మాజీమంత్రి ఎలమలమ్‌ కరీం
– తెలంగాణలో సంఘాలపై నిషేధం : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షులు వీరాంజనేయులు
– విద్యుత్‌ బస్సుల విధివిధానాలు మార్చాలి : వీఎస్‌ రావు
– రెండోరోజు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ మహాసభలో పలు అంశాలపై చర్చలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రవాణారంగ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంలో కేరళ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి ఎలమలమ్‌ కరీం తెలిపారు. గడచిన పదేండ్లలో ఆ రాష్ట్ర ఆర్టీసీకి ప్రభుత్వం రూ.11వేల కోట్ల నిధుల్ని బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా విడుదల చేసిందని స్పష్టం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో రెండోరోజు జరిగిన ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) 12వ జాతీయ మహాసభలో ఆయన మాట్లాడారు. కేరళలో రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామనీ, దానిద్వారా అసంఘటిత రంగంలోని ఆటో, లారీ, ఈ-రిక్షా, అంబులెన్స్‌, స్కూల్‌ బస్సు డ్రైవర్లకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించబడు తున్నాయని వివరించారు. అలాగే కేరళ ఆర్టీసీలోని రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్‌ కోసం ఏటా ప్రభుత్వ బడ్జెట్లో రూ.75 కోట్లు విడుదల చేస్తున్నామనీ, కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

విద్యుత్‌ బస్సుల విధివిధానాలు మార్చాలి : ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ కార్యదర్శి వీఎస్‌ రావు
విద్యుత్‌ బస్సులపై కేంద్రప్రభుత్వ విధివిధానాలు మార్చాలనీ, ఆ బస్సుల్ని ఆర్టీసీలకే కేటాయించాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ కార్యదర్శి వీఎస్‌ రావు కోరారు. ఈ మేరకు మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించాలనే తీర్మానాన్ని సురేంద్ర ప్రవేశపెట్టారు. అసంఘటిత రోడ్డు రవాణా కార్మికులకు సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలనే తీర్మానాన్ని విలాస్‌ రావత్‌, లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలనీ, ట్రేడ్‌ యూనియన్ల హక్కుల్ని కాపాడాలనే తీర్మానాన్ని పీకే రాజన్‌ ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్‌ పెంచాలనీ, హయ్యర్‌ పెన్షన్‌ సౌకర్యం అందరికీ కల్పించాలనే తీర్మానాన్ని కిషన్‌సింగ్‌ రాథోడ్‌ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ నుంచి ఆ రాష్ట్ర ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ కార్మికులపై వేధింపులు, పనిభారాలు ఆపాలనీ, ఎమ్‌వీ యాక్ట్‌ సవరణలు రద్దు చేయాలని కోరారు. కేరళ , తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు మహాసభ చర్చల్లో భాగస్వాములయ్యారు.

తెలంగాణలో సంఘాలపై నిషేధం
ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ జాతీయ మహాసభలో టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు ప్రసంగించారు. తెలంగాణ ఆర్టీసీలో యూనియన్‌ కార్య కలాపాలు అనుమతించటం లేదనీ, ఇది ప్రజాస్వామ్య ఉల్లంఘనే అని తేల్చిచెప్పారు. అయినా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నిరంతరం పనిచేస్తూనే ఉందన్నారు.
చర్చల్లో పాల్గొన్న ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రవాణారంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రవాణా రంగ కార్మికులు, డ్రైవర్లపై దాడుల్ని ఆపాలనీ, వారికి రక్షణ కల్పించాలనీ, ఆటో, లారీ, క్యాబ్‌, ఈ-రిక్షా డ్రైవర్లకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -