రెండు దశల్లో నిర్వహణ
డిసెంబర్ 9, 11 తేదీల్లో ఓటింగ్
డిసెంబర్ 13న కౌంటింగ్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎ. షాజహాన్ ప్రకటన
తిరువనంతపురం : కేరళ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9, 11 తేదీలలో పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎ. షాజహాన్ సోమవారం తిరువనంతపురంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజ, ఎర్నాకుళం జిల్లాల్లో డిసెంబర్ 9న పోలింగ్ జరగనున్నది. త్రిసూర్, మలప్పురం, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్, కాసర్‌గోడ్, కోజీకోడ్ జిల్లాల్లో డిసెంబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. వాస్తవ ఎన్నికలకు ఒక గంట ముందు మాక్ పోల్ నిర్వహిస్తారు. ఇక డిసెంబర్ 13న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఇక నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 21. నామినేషన్ పేపర్ల పరిశీలన నవంబర్ 22న నిర్వహిస్తారు. నవంబర్ 24ను నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది.
ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని షాజహాన్ చెప్పారు. కేరళలో 1200 స్థానిక సంస్థలకు గానూ 1199 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పునర్విభజన ప్రక్రియ తర్వాత కేరళలో 1200 స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్య 23,612కు పెరిగింది. 23,576 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 36 వార్డులున్న కన్నూర్‌లోని మట్టన్నూర్ మునిసిపాలిటీకి 2027 సెప్టెంబర్‌లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషనర్ చెప్పారు. గ్రామ పంచాయతీల్లోని 17,337 వార్డులు, బ్లాక్ పంచాయతీల్లోని 2267 వార్డులు, 346 జిల్లా పంచాయతీ వార్డులు, 3205 మునిసిపాలిటీ వార్డులు, 421 కార్పొరేసన్ వార్డుల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం మొత్తం 33,746 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గత స్థానిక ఎన్నికలు కరోనా మహమ్మారి నడుమ 2020లో జరిగాయి. ఈ ఎన్నికలను మూడు దశల్లో జరిపారు. ఆ ఎన్నికల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌పై ఆధిక్యతను ప్రదర్శించింది. కేరళలో 2.84 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు.



