ఎల్డీఎఫ్ సర్కార్ తీర్మానానికి కేంద్రక్యాబినెట్ ఆమోదం
పవర్‌గ్రిడ్‌కు ఈక్విటీ పెట్టుబడి పరిమితి పెంపు
రూ.12,236 కోట్లతో రైల్, మెట్రో, ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులకూ గ్రీన్‌సిగల్
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
2024 జూన్ 24న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మారుస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చిన అన్ని భాషల్లో ‘కేరళం’గా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు స్పష్టం చేశారు. ‘పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలుస్తారని, స్వాతంత్ర పోరాట సమయం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ఉద్భవించిందని, ‘రాష్ట్రం అసలు పేరు కేరళం. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారని, తిరిగి పేరు మార్పును కోరుతున్నట్టు వచ్చిన ప్రతిపాదనను ఆ రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతామని, అసెంబ్లీ ఆమోదం అనంతరం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. కేరళ రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను స్వీకరించిన తరువాత, కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని, ఈ పేరు మార్పు బిల్లు-2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫారసు చేస్తారని వివరించారు. మలయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
పవర్‌గ్రిడ్‌కు ఈక్విటీ పెట్టుబడి పరిమితి పెంపు
మహారత్న సీపీఎస్‌ఈలకు అధికారాల అప్పగింతపై ఉన్న మార్గదర్శకాల నుంచి పవర్ గ్రిడ్‌కు ఈక్విటీ పెట్టుబడి పరిమితిని రూ.5000 కోట్ల నుంచి రూ.7500 కోట్లకు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం నాడిక్కడ నూతన పీఎంఓ బిల్డింగ్ సేవా తీర్థ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిం చారు. మహారత్న సీపీఎస్‌ఈలకు వర్తించే అధి కారాల అప్పగింతపై పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ డిపార్ట్ మెంట్ (డీపీఈ) 2010 ఫిబ్రవరి 4 నాటి మార్గదర్శకాల ప్రకారం పవర్ గ్రిడ్‌కు మెరుగైన అధికారాలు కల్పిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. దీంతో కంపెనీ నికర విలువలో 15 శాతంగా ఉన్న ప్రస్తుత పరిమితిని నిలుపుకుంటూనే పవర్ గ్రిడ్ కోసం అనుమ తించదగిన ఈక్విటీ పెట్టుబడి పరిమితిని ప్రతి అనుబంధ సంస్థకు రూ.7,500 కోట్లకు పెంచడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడం లోనూ సహాయపడుతుందన్నారు. పవర్ గ్రిడ్ ఇప్పుడు అల్ట్రా హై వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ (యూహెచ్‌వీఏసీ), హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (హెచ్ వీడీసీి) ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ల వంటి క్యాపిటల్ ఇంటెన్సివ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల బిడ్‌లలో పాల్గొనడానికి వీలుంటుందని తెలిపారు. 2026-27 సీజన్‌కు గాను ముడి జనపనార (టీడీ-3 గ్రేడ్) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 5,925గా నిర్ణయిస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
రూ.12,236 కోట్లతో రైల్, మెట్రో, ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులు
రూ.12,236 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో రైల్వేలు, అర్బన్ ట్రాన్‌పోర్ట్, ఏవియేషన్, మౌలికసదుపాయాల కల్పన వంటివి ఉన్నాయన్నారు. ఇందులో రూ.5.236 కోట్ల అంచనా వ్యయంతో గోండియా-జబల్‌పూర్ రైల్వే లేన్ డబ్లింగ్ పనులు, రూ.2,668 కోట్లతో పునరాఖ్-కియుల్ మధ్య 3, 4వ రైల్ లేన్ ప్రాజెక్టులు, రూ.1,168 కోట్ల అంచనా వ్యయంతో గమారియా-చాందిల్ మధ్య 3,4వ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపిందన్నారు.
రూ.1,667 కోట్లతో శ్రీనగర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు సమ్మతి తెలిపిందన్నారు. 73.18 ఎకరాల్లోని 71,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాల తో నిర్మించే ఈ టెర్మినల్ భవనం రద్దీ సమాయాల్లో 2,900 మంది ప్రయాణికులు, ఏడాదికి 10 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా డిజైన్ చేసినట్టు స్పష్టం చేశారు.
రూ.1,067.35 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2బీ విస్తరణకు కూడా మంత్రివర్గం గ్రీన్‌సిగల్ ఇచ్చిందని, గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల దూరంతో మూడు ఎలివేటెడ్ స్టేషన్లతో నాలుగేండ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ప్రణాళిక సిద్ధమైందన్నారు.
కేరళ పేరు కేరళంగా మార్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



