Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంకేరళ అభివృద్ధి దేశానికే తలమానికం

కేరళ అభివృద్ధి దేశానికే తలమానికం

- Advertisement -

ఎన్నికల ప్రచార సభల్లో సీపీఐ(ఎం) నాయకురాలు బృందాకరత్‌
దేశాన్ని బలహీనపరుస్తోన్న కేంద్రం : మరియం ధావలే
ఆలప్పుజ :
కేరళ అభివృద్ధి దేశానికే తలమానికమని సీపీఐ(ఎం) నాయకురాలు బృందాకరత్‌ అన్నారు. ఆలప్పుజ జిల్లాలోని హరిపాడ్‌, కాయంకుళంలో, ఎర్నాకులం జిల్లాలోని ఆలూవా, కున్నతునాడు, ఎడపల్లిలో లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌) నిర్వహించిన ఎన్నికల సభల్లో పాల్గొని మాట్లాడారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విపత్తు బాధితుల కుటుంబాల కోసం వాయనాడ్‌లో అభివృద్ధి చేస్తున్న టౌన్‌షిప్‌ పునరావాసానికి ఒక ఆదర్శంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన అనేక హామీలను ఆ పార్టీ నెరవేర్చలేదని, ఇతర ప్రాంతాల్లో వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతే కేరళలో కూడా హామీలు ఇవ్వాలని ఆమె కాంగ్రెస్‌ను విమర్శించారు. మతతత్వ రాజకీయాలకు, బీజేపీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం), ఎల్‌డీఎఫ్‌ ధృడమైన వైఖరిని అవలంబిస్తాయని చెప్పారు. ఈ వైఖరిని మరుగుపరిచేందుకు కాంగ్రెస్‌ ”ఒప్పందం” అనే తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు మైనారిటీ మత సమూహాలను లక్ష్యంగా చేసుకుందని, వారిచే నడపబడుతున్న సంస్థల లైసెన్సులను రద్దు చేయడానికి, స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తోందని అన్నారు.

దేశాన్ని బలహీనపరుస్తోన్న కేంద్రం : మరియం ధావలే
గత 12 ఏండ్లుగా మోడీ ప్రభుత్వం దేశాన్ని బలహీనపరుస్తోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు మరియం ధావలే పేర్కొన్నారు. బీజేపీని సమర్థవంతంగా ఎదిరించే శక్తి కేవలం వామపక్షాలకు మాత్రమే ఉందని అన్నారు. మలూరు (మట్టన్నూరు నియోజకవర్గం), చోక్లి (తలస్సేరి నియోజకవర్గం)లో ఎల్డీఎఫ్‌ నిర్వహించిన ఎన్నికల సభలలో మరియం ధావలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరవూరు నియోజకవర్గం ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి కేకే శైలజ టీచర్‌తో కలిసి రోడ్‌ షోను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలోనే కేరళలో మహిళలు గొప్ప పురోగతిని సాధించారని, బీజేపీ పాలిత గుజరాత్‌ లేదా కాంగ్రెస్‌ పాలిత కర్నాటకలో అటువంటి పురోగతి కనిపించడం లేదని తెలిపారు. కేరళ ప్రభుత్వం ప్రజలకు ఇండ్లు నిర్మిస్తుండగా, ఆ రాష్ట్రాల్లో ఇండ్లను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -