– తీవ్ర పేదరిక నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు
– నాలుగు లక్షల మంది సర్వేయర్లతో కుటుంబాల గుర్తింపు
– ప్రమాణాలుగా ఆహారం, ఆరోగ్యం, ఆదాయం, నివాసం
– ప్రతీ కుటుంబ పరిస్థితిని బట్టి మైక్రో ప్లాన్
– ఆర్థిక సహాయం, ఇండ్లు, వైద్య సేవలు, వసతుల కల్పన
– పేదరికం నుంచి బయటపడిన పలు కుటుంబాలు
తిరువనంతపురం : భారత్ ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సవాళ్లలో పేదరికం ఒకటి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కేంద్రంలోని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. దేశంలో మాత్రం పేదరికం సమస్య తీరటం లేదు. కానీ కేరళ మాత్రం దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు కేరళ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఈనెల1న శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. దీంతో దేశ చరిత్రలో కేరళ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
రాష్ట్రంలో అత్యంత పేదరికాన్ని పారదోలటానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లింది. తీవ్ర పేదరిక నిర్మూలన కార్యక్రమం(ఎక్స్‌ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్-ఈపీఈపీ) ద్వారా అత్యంత పేద కుటుంబాలను పేదరికం అనే మహమ్మారి నుంచి దూరం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల మంది ఎన్యుమరేటర్లు (సర్వేయర్లు) రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డుకు వెళ్లి అత్యంత పేద కుటుంబాలను గుర్తించారు. గుర్తింపునకు ఆహారం, ఆరోగ్యం, ఆదాయం, నివాసం అనే నాలుగు ప్రమాణాలను ఉపయోగించారు. ఇవి ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీలు)కు అనుగుణంగా ఉన్నాయి. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64,006 కుటుంబాల (1,03,099 మంది వ్యక్తులు) ను అత్యంత పేదలుగా గుర్తించారు. 2021లో నిటి ఆయోగ్ అధ్యయనం ప్రకారం కేరళ పేదరిక రేటు 0.7 శాతంగా దేశంలోనే కనిష్టంగా గుర్తించబడింది. 1970లో ఉన్న 59.8 శాతం పేదరికాన్ని క్రమంగా తగ్గించడంలో ప్రభుత్వ సంక్షేమ విధానాలు ప్రధాన పాత్ర వహించాయి.
మైక్రోప్లాన్ ఇలా..
సాధారణంగా ప్రభుత్వ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా అమలవుతాయి. కానీ ఈపీఈపీలో భాగంగా ప్రతి కుటుంబానికి వారి పరిస్థితిని బట్టి ప్రత్యేకమైన ‘మైక్రో ప్లాన్ (వ్యక్తిగత ప్రణాళిక)’ను రూపొందించారు. కొందరికి ఇండ్లు కట్టించారు, కొందరికి వ్యాపారం మొదలు పెట్టేందుకు రూ.50వేలు వంటి ఆర్థిక సహాయం ఇచ్చారు. కొందరికి వైద్య సహాయం, మందులు, పల్లియేటివ్ కేర్ (పాలనా వైద్యం) అందించారు. కొన్ని సందర్భాల్లో అధికారులు డిటెక్టివ్‌లా పని చేసి వ్యక్తులను వెతికి కుటుంబాలను తిరిగి కలిపి, వారికి ఇండ్లు నిర్మించారు.
పలు కుటుంబాలకు తోడ్పాటు
ఉదాహరణకు.. తిరువనంతపురంలోని చెల్లమంగళం వార్డులో గల అంబికా దేవి (57) అనే మహిళకు ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంటి ముందు చిన్న కిరాణా దుకాణం పెట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.50వేలు సహాయం చేసింది. ఇప్పుడు ఆ మహిళ ఆ కిరాణా దుకాణాన్ని నడుపుకుంటు జీవనం సాగిస్తున్నది. ” నా భర్త ఏడేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత పాడైపోయిన మా ఇంట్లో నివసించాను. కానీ అందులో ఒక భాగం కూలిపోయింది. దీంతో నా చెల్లెలి ఇంట్లో రెండేండ్లు ఉన్నాను. గత సెప్టెంబర్‌లో నాకు ఈ ఇల్లు ఈపీఈపీ ద్వారా లభించింది” అని అంబికా చెప్పింది. ”డిసెంబర్‌లో నాకు రూ.50వేల సహాయం అందింది. నేను ఎక్కువగా నడవలేకపోవడంతో కార్పొరేషన్ అధికారులు కిరాణా షాపు మొదలు పెట్టాలని సూచించారు. ఇప్పుడు పొరుగున ఉన్నవారు కూడా ఇక్కడి నుంచే సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నా జీవనానికి సరిపడా ఆదాయం వస్తోంది” అని ఆమె తెలిపింది.
ఇడుక్కి జిల్లా మంకుళం పంచాయతీకి చెందిన దాస్‌రాజ్ (67) భార్య, కుమారుల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు. దానికి తోడు ఆయనకు జీవనోపాధి కూడా కావాల్సి ఉంది. అయితే ఈపీఈపీ కార్యక్రమం ఆయనకు ఎంతగానో దోహదం చేసింది. ”నేను కూడా హృదయ సమస్యలతో బాధపడుతున్నాను. ప్రాజెక్టు ద్వారా మాకు ఇల్లు, కుడుంబశ్రీ ద్వారా రూ.50వేలతో మూడు మేకలు కొనుగోలు చేయగలిగాము” అని ఆయన చెప్పారు.
ప్రతి కుటుంబానికీ తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించారు. స్థానిక స్వపరిపాలన విభాగం (ఎల్‌స్‌జీడీ) గణాంకాల ప్రకారం 21,263 మందికి అవసరమైన పత్రాలు, 3,913 కుటుంబాలకు ఇండ్లు, 1338 కుటుంబాలకు భూమి, ఇల్లు, 5,651 ఇండ్ల మరమ్మతులు జరిగాయి. ఇక ఆహారం, ఔషధాలు, ప్యాలియేటివ్ కేర్ 5,777 మందికి , జీవనోపాధి 4,394 కుటుంబాలకు అందించారు.
ఇడుక్కి జిల్లాలోని కుమారమంగళం పంచాయతీకి చెందిన షాయి వర్గీస్, ఆయన భార్య సునీత ఇద్దరూ దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారు ఒక గుడిసెలో నివసిస్తున్నారు. లైఫ్ ప్రాజెక్ట్ కింద ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినా.. భూమి విభజన సమస్యతో ఆలస్యమైంది. దీంతో 27 ఏండ్లుగా కనిపించకుండా పోయిన ఆయన సోదరుడిని వెతికి, తిరిగి రప్పించి భూమి విభజన చేశారు. తర్వాత షాయి కుటుంబానికి ఇల్లు, జీవనోపాధి కోసం మ్యూజిక్ బాక్స్, మైక్‌లు ఇచ్చినట్టు గ్రామ అధికారి లసీలా చెప్పారు. ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యం కూడా ప్రాజెక్ట్ విజయానికి కారణమైంది.
ఈపీఈపీ ప్రాజెక్ట్ లక్ష్యం.. ఈ కుటుంబాలు తిరిగి పేదరికంలో పడకూడదు. కొల్లాం జిల్లా చవర పంచాయతీకి చెందిన రెమ్యా(28) అనే యువతికి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. ఆమె భర్త ప్రశాంత్ కోవిడ్‌తో మరణించాడు. ప్రభుత్వం ఆమెకు ఇల్లు, స్థానిక జనసేవన కేంద్రంలో ఉద్యోగం కల్పించింది. దీంతో ఇప్పుడు ఆమె తన పిల్లలతో పాటు అత్తమామలను పోషించగులుగుతున్నది.
”మా పంచాయతీలోని 16 కుటుంబాలను అధికారులు తరచుగా పర్యవేక్షించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారానే వారందరికీ అవసరమైన పత్రాలు, ఇండ్లు మొదలైనవి సాధ్యమయ్యాయి” అని కన్నూర్ జిల్లాలోని కుట్టియాట్టూర్ పంచాయతీ అధ్యక్షురాలు పి.పి. రేజీ తెలిపారు. కాగా రాష్ట్రంలో తీవ్ర పేదరికం నంచి బయటపడిన పంచాయతీగా కుట్టియాట్టూర్ నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కేరళ బలమైన వికేంద్రీకరణ పాలన వల్లే సాధ్యమైంది. అన్ని శాఖలూ సమన్వయంతో పని చేశాయి. రేషన్ కార్డులు, భూములు, వైద్యం, విద్య, ఉచిత ప్రయాణ కార్డులు.. అన్నీ సమన్వయం చేసుకుంటూ అందించాం. ముఖ్యమంత్రి ప్రాజెక్టును వ్యక్తిగతంగా పర్యవేక్షించారు.
ఈపీఈపీతో కేరళ సక్సెస్
- Advertisement -
- Advertisement -



