Wednesday, November 19, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 10 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కీలక కుట్రదారుడు

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 10 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కీలక కుట్రదారుడు

- Advertisement -

న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుడుగా భావిస్తున్న జాసిర్‌ బిలాల్‌ వనీ అలియాస్‌ డానిష్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం 10 రోజుల కస్టడీ విధించింది. డానిష్‌ను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యర్థన మేరకు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి అంజు బజాజ్‌ చంద్నా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డానిష్‌ను జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో భారీ ఎత్తున పోలీసులు, సత్వర కార్యాచరణ బలగాలను మోహరించారు. మీడియా ప్రతినిధులను కూడా కోర్టు ఆవరణలోకి ప్రవేశించకుండా నిషేధించారు. ఎర్రకోట వద్ద కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డ ఉగ్రవాది ఉమర్‌ ఉన్‌ నబీతో కలిసి డానిష్‌ ఈ కుట్ర అమలుకు పనిచేశాడని ఎన్‌ఐఏ సోమవారం తన ప్రకటనలో పేర్కొంది. డ్రోన్లను నడపడం, రాకెట్లను తయారు చేయడం వంటి విషయాల్లో నబీకి సాంకేతికంగా సహాయం చేశాడని ఎన్‌ఐఏ పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అమీర్‌ రషీద్‌ అలీని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. బాంబు పేలుడుకు ఉపయోగించిన కారు అలీ పేరు మీదనే రిజిస్టర్‌ అయింది. అలీని సోమవారం ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా 10 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీని కోర్టు విధించింది. ఉగ్రవాది నబీకి అమీర్‌ వసతి సౌకర్యం కల్పించడంతో పాటు ఇతర మద్దతు అందించాడని ఎన్‌ఐఏ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -