Tuesday, July 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజన, కులగణనలో కీలకాంశాలు

జన, కులగణనలో కీలకాంశాలు

- Advertisement -

సుదీర్ఘ జాప్యం, అనిశ్చితి అనంతరం ఎట్టకేలకు 2027లో జాతీయ జనాభా లెక్కల సేకరణ కోసం భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాబోయే ఈ జనగణనలో ప్రధాన మార్పు ఏమిటంటే కులగణనను చేర్చాలని నిర్ణయించడం. కులగణనను అధికార బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నాయి.సామాజిక న్యాయం కోసమే ఈ చర్య తీసుకోవడం జరిగిందని ఇప్పుడు బీజేపీ ప్రతినిధి చెబుతున్నప్పటికీ ఈ నిర్ణయం వెనుక సూత్రబద్ధమైన నిబద్ధత కంటే రాజకీయ ఉద్దేశాలున్నాయని అర్థమవుతోంది.
కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా జనాభా లెక్కల సేకరణ ఆలస్యమైనప్పటికీ ఆ తర్వాత దాన్ని చేపట్టడంలో బీజేపీ పెద్దగా ఆసక్తి చూపలేదు. బహుశా నియోజకవర్గాల పునర్విభజనను త్వరగా జరపాలని భావించి ఉండవచ్చు. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన ఆధారంగా పునర్విభజన ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుంది. 2026కు ముందు జనాభా లెక్కల సేకరణ జరిపితే పునర్విభజనను చేపట్టడం సాధ్యపడదు. ఇప్పుడు 2027లో జనగణన జరపాలని నిర్ణయించినందున వెంటనే పునర్విభజన కసరత్తుకు శ్రీకారం చుట్టబోతున్నారు.


కులగణన చేపట్టాలన్న డిమాండ్లను బీజేపీ నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంది. కులాల వారీగా లెక్కల సేకరణను వ్యతిరేకించాలని తాము విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు 2021లో లోక్‌సభకు కేంద్రం తెలియజేసింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఇదే వైఖరిని పునరుద్ఘాటించింది. ప్రధానమంత్రి స్వయంగా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో చేసిన ప్రసంగంలో కుల విభజనను తక్కువ చేసి మాట్లాడారు. భారతదేశంలో కేవలం నాలుగు కులాలు…మహిళలు, యువత, రైతులు, పేదలు మాత్రమే ఉన్నారని ఆయన ప్రకటించారు.
కులగణన విషయంలో బీజేపీ దీర్ఘకాలిక వ్యతిరేకత దాని భావజాలంలోనే ఉంది. కులగణనను సంఫ్‌ుపరివార్‌ ఎప్పుడూ అనుమానం గానే చూస్తోంది. అది హిందూ సమాజంలోని తీవ్ర అసమానతలను బయటపెడుతుందని, తాము హిందూత్వ ద్వారా కోరుకున్న ఐక్యతను దెబ్బతీస్తుందని భయపడింది. అయితే వాస్తవానికి కుల గణాంకాలు అట్టడుగు వర్గాల స్వరాన్ని పెంచుతాయని, వనరులను మరింత సమానంగా పంపిణీ చేయాలని ఆ వర్గాలు డిమాండ్‌ చేస్తాయని, బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ మత సమీకరణ వ్యూహాన్ని సవాలు చేస్తాయని సంఫ్‌ుపరివార్‌ ఆందోళన చెందుతోంది.
రాజకీయ యూాటర్న్‌
అయినప్పటికీ బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. 2024 ఎన్నికలలో ఎదురైన పరాజయాలు, ఓబీసీ ఓటర్లలో పడిపోతున్న మద్దతును దృష్టిలో పెట్టుకుని 2027 జనగణనలో కులాల వారీ సమాచారాన్ని సేకరిస్తామని ప్రకటించింది. ఇది రాజకీయ ప్రేరేపిత మార్పుగా కన్పిస్తోంది. కులగణనను ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శిస్తున్న బీజేపీ, వారి ప్రభావాన్ని తటస్థం చేసేందుకు వాటి డిమాండ్‌నే అందిపుచ్చుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సైతం సానుకూల వైఖరి ప్రదర్శించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించనంత వరకూ కులాల సమాచారాన్ని సంక్షేమ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చునని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ప్రముఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
చాలా కాలంగా కుల ఆధారిత సమాచారం అందుబాటులో లేకపోవడానికి కాంగ్రెస్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ పార్టీ కులగణనను నిర్వహించలేదు లేదా మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేయలేదు. 2011లో సామాజిక-ఆర్థిక కులగణన (ఎస్‌ఈసీసీ)ను చేపట్టింది కానీ దాన్ని ఉద్దేశపూర్వకం గానే సార్వత్రిక గణన నుండి వేరుచేసింది. ఆ తర్వాత కచ్చితత్వం లోపించిందంటూ కులగణనను పక్కన పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఈసీసీ డేటాను పూర్తిగా పక్కన పెట్టింది. దీంతో ఈ ప్రక్రియ కోసం ఖర్చు చేసిన రూ.5వేల కోట్ల ప్రజాధనం వృథా అయింది.


భారతదేశంలో కులగణనకు సుదీర్ఘమైన, విభిన్నమైన చరిత్ర ఉంది. 1881 నుండి 1941 వరకూ జనాభా లెక్కల సేకరణలో కులాల సమాచారాన్ని కూడా తీసుకునే వారు. స్వాతంత్య్రానంతరం దీనికి స్వస్తి చెప్పారు. ఇకపై జనాభా లెక్కల సేకరణలో కుల ప్రస్తావన ఉండబోదని 1950లో వల్లభ్‌భారు పటేల్‌ ప్రకటించారు. కుల సమాచార సేకరణను తిరిగి ప్రారంభించాలని 1953లో కాలా కాలేల్కర్‌ నేతృత్వంలోని మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్‌, ఆ తర్వాత 1980లో మండల్‌ కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరాయి. కచ్చితమైన సంఖ్య లేనిపక్షంలో రిజర్వేషన్లు, సంక్షేమ విధానాలు లోపభూయిష్టంగా ఉంటాయిని వాదించాయి. అయినప్పటికీ ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ సిఫార్సులను పట్టించుకోలేదు. రాబోయే జనగణనలో కులాల సమాచారాన్ని సేకరించాలని 2021లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


జాతీయ స్థాయిలో కులాల సమాచారం లేకపోవడంతో అనేక రాష్ట్రాలు సొంతగా కుల సర్వేలు ప్రారంభించాయి. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి 1968లో కేరళలో ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సమగ్ర, శాస్త్రీయ పద్ధతిలో కుల వివరాల సేకరణ కోసం కులాలు, వర్గాలపై సామాజిక-ఆర్థిక సర్వే చేపట్టింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, అత్యంత వెనుకబడిన తరగతుల వారు 63 శాతానికి పైగా ఉన్నారని 2023లో బీహార్‌లో నిర్వహించిన కుల సర్వే తేల్చింది. దీంతో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం 50 నుండి 65 శాతానికి పెంచింది. అయితే కోర్టు వివాదం కారణంగా దాని అమలు ఆగిపోయింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం 2024లో కులసర్వే నిర్వహించి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వే షన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించింది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో చేర్చడం కోసం దానిని పంపింది. కర్నాటక సైతం తన సామాజిక ఆర్థిక, విద్యా సర్వే ద్వారా చర్యలు చేపట్టింది. అయితే రాజకీయ అనిశ్చితులు, డేటా చెల్లుబాటుపై ఆందోళనల నేపథ్యంలో ఆ నివేదికను ఇంకా ప్రచురించలేదు. రాష్ట్రాల వారీగా జరిగిన కుల సర్వేలు, వివిధ వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్లు, వాటి తక్షణ రాజకీయ ప్రయోజనాల రీత్యా కులాల వారీగా లెక్కలు సేకరించడానికి బీజేపీ అంగీకరించాల్సి వచ్చింది.


2027 జనగణన రెండు దశలుగా జరుగుతుంది. 2026 అక్టోబరులో ప్రారంభమయ్యే తొలిదశలో మంచు కురిసే ప్రాంతాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1న రెండో దశ ప్రారంభమవుతుంది. దీనిలో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనాభా లెక్కలను సేకరిస్తారు. జనగణనలో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది గృహాలను లెక్కించడం, ఆ తర్వాత జనాభా లెక్కలు సేకరిస్తారు. మొదటిసారిగా జనగణనను పూర్తిగా డిజిటలీకరణ చేస్తున్నారు. మొబైల్‌ యాప్స్‌, స్వీయ గణన, రియల్‌ -టైమ్‌ పర్యవేక్షణను అందులో చేరుస్తారు. జనాభా లెక్కల సేకరణ దశలో కుల సమాచారాన్ని తీసుకుంటారు. గణన పూర్తయిన పది రోజుల్లో ప్రాథమిక సమాచారాన్ని విడుదల చేస్తారు. అనంతరం ఆరు నెలల్లో సవివరమైన విభజన డేటా విడుదలవుతుంది. ఈ కాలక్రమాన్ని పాటించినట్లయితే మొత్తం పునర్విభజన ప్రక్రియను 2029 ఎన్నికల లోగానే పూర్తి చేయవచ్చు. అయితే తన తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ మొత్తం ప్రక్రియను బీజేపీ మార్చే అవకాశం కూడా ఉంది.


రాజకీయ చిక్కుముడులు, సవాళ్లు
జనగణనలో కులాన్ని చేర్చడం వల్ల వివిధ కులాల సంఖ్య, వాటి సామాజిక ఆర్థిక స్థితిగతులకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారం లభిస్తుంది. రిజర్వేషన్ల పెంపు, ఓబీసీల ఉపావర్గీకరణ, రిజర్వేషన్లపై ప్రస్తుతం అమలులో ఉన్న యాభై శాతం పరిమితి తొలగింపు డిమాండ్లను బలపరచడానికి ఇది దోహదపడవచ్చు. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన (ఈడబ్ల్యూఎస్‌) వారికి పది శాతం కోటా వెనుక ఉన్న హేతుబద్ధతను ధృవీకరించడానికి లేదా తిరస్కరించడానికి కూడా ఈ డేటా ఉపకరిస్తుంది. ఓబీసీల క్రీమిలేయర్‌ ప్రమాణాలను పరిశీలించవచ్చు. ఈ డేటా కొత్త సమాచారాన్ని వెల్లడిస్తే ఎస్సీలకు కూడా విస్తరింపజేయాలన్న డిమాండ్‌ ఊపందుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రయివేటు రంగానికి దీన్ని విస్తరించాలనే అభిప్రాయం కులగణనతో బలపడుతుంది. విశ్వసనీయ కుల సమాచారం అందుబాటులో ఉన్న పక్షంలో న్యాయస్థానాలు విధానపరమైన ప్రాతిపదికన కాకుండా మెరిట్‌ ఆధారంగా తీర్పు చెప్పాల్సి వస్తుంది. అయితే అనేక సవాళ్లు కూడా ఎదురవుతాయి. వివిధ ప్రాంతాలు, భాషలు, పేర్లకు సంబంధించిన సంప్రదాయాల్లో వేలాది కులాలు, ఉప కులాల సమాచారాన్ని సేకరించడం ఒక గొప్ప పని. ప్రామాణికమైన వర్గీకరణ వ్యవస్థ లేకుండా సమాచారాన్ని సేకరిస్తే అది అస్థిరంగా, నిరుపయోగంగా ఉంటుంది. అధికంగా లెక్కించడం, తక్కువగా లెక్కించడం, తప్పుడు వర్గీకరణకు సంబంధించిన సవాళ్లు కూడా ఉంటాయి.


జనగణన రిజర్వేషన్లతో పాటు ఇతర ముఖ్యమైన రాజకీయ అంశాలను కూడా ప్రభావితం చేస్తుంది.ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం నియోజకవర్గాల పునర్విభజన. 1976 నుండి ఈ ప్రక్రియ జరగడం లేదు. అయితే 2026 జనగణన ఆధారంగా దీనిని చేపట్టబోతున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు కూడా జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జరుగుతుంది. అదీకాక ఇక్కడ ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను తాజా పరచడం కోసం దీన్ని ఉపయోగించవచ్చునని, ఆ తర్వాత దాన్ని వివాదాస్పద జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) కోసం కూడా ఉపయోగిస్తారని అనుమానిస్తున్నారు. పైగా అధికార పార్టీ విభజన అజెండాను ముందుకు తీసుకుపోవడానికి గణన ప్రక్రియను దుర్వినియోగం చేయవచ్చునని కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనగణనతో పాటు ఎన్‌పీఆర్‌ను తాజా పరచరాదన్న డిమాండ్‌ బలపడుతోంది.


జనగణన సమాచారాన్ని విస్తృతంగా ఉపయోగించవచ్చు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే విధాన రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల పంపిణీకి మార్గదర్శనం చేయడానికి దోహదపడుతుంది. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు మంత్రిత్వ శాఖలకు ఈ సమాచారం తప్పనిసరి. వలసలు, ఉపాధి, సామాజిక చలనశీల ధోరణులను అర్థం చేసుకోవడానికి విధాన నిర్ణేతలకు సాయపడుతుంది. కుల సమాచారం ఉపయుక్తమైనదే అయినప్పటికీ అది అన్నింటికీ మందు కాదు. కుల సమాచారం అందుబాటులో ఉన్నచోట కూడా ఎస్సీ, ఎస్టీల్లో అసమానతలు వేళ్లూనుకుపోయి ఉన్నాయి. కేవలం కులగణన ద్వారా న్యాయం చేకూరదు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడడంలో మన నిబద్ధతను అనవసరమైన భ్రమలు బలహీనపరుస్తాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో నయా ఉదారవాద విధానాలు సంక్షేమ కార్యక్రమాలను బలహీన పరిచాయి. ప్రయివేటీకరణను ప్రోత్సహించాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాయి. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉద్దేశించిన పథకాలను నీరుకార్చాయి. ఈ వ్యవస్థీకృత సమస్యలను సవాలు చేయని పక్షంలో కులగణన మాత్రమే పేదలు, అణగారిన వర్గాల జీవితాలను మార్చదు. అయినా న్యాయం కోసం జరిపే పోరాటంలో కుల సమాచారం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడు తుంది. అసమానతల నిజ స్వభావాన్ని బహిర్గతం చేయడానికి, ప్రస్తుత విధానాల వైఫల్యాన్ని బయటపెట్టడానికి, కుల ఆధారిత రాజకీయాలను ఎండగట్టడానికి ఇది సాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే కులాలకు అతీతంగా నిర్మాణాత్మక మార్పుల కోసం పోరాడే విస్తృత ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది. నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణం, భూసంస్కరణలు, ఉపాధి హామీలు, ప్రభుత్వ సేవల కల్పనలో సార్వత్రిక ప్రవేశం లభిస్తుంది.
అనువాదం: పినపాక సంగమేశ్వరరావు
బి.వి.రాఘవులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -