– మోహన్ బాబు యూనివర్సిటీ బరితెగింపు
– ఫాంహౌస్‌లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నిర్బంధం.. దాడి
– సిపిఎం నేతల చొరవతో రంగంలోకి పోలీసులు
– మోహన్‌బాబు, విష్ణు సహా పలువురిపై క్రిమినల్ కేసు
– నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు విద్యార్థి సంఘాల పిలుపు
తిరుపతి : ‘అరిస్తే చరుస్తా… చరిస్తే కరుస్తా…’ అంటూ అసెంబ్లీ రౌడీ సినిమాలో సినీనటుడు మోహన్‌బాబు చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయం కూడా అదే రౌడీఇజాన్ని ఆదర్శంగా తీసుకుందేమో!
విచ్చల విడిగా సాగించిన ఫీజుల దందాలో విద్యార్థుల తల్లితండ్రుల మూలుగులు పిండి వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరడానికి మంగళవారం నాడు ప్రయత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షులు వినోద్ లను కిడ్నాప్ చేసింది. దీనికోసం రంగంలోకి బౌన్సర్లను దించింది. హత్యాయత్నానికి యత్నించింది. విద్యార్థి నేతలను కిడ్నాప్ చేసిన బౌన్సర్లు అటవీ మార్గంలో తిప్పుతూ, ఫైబర్ లాఠీలతో కొడుతూ వారిలో భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నించారు. నారావారిపల్లి సమీపంలోని ఓ ఫాం హౌస్‌లో నిర్బంధించారు. అయితే, ఇది సినిమా కాదు కదా! మోహన్‌బాబు స్క్రీన్ ప్లే ప్రకారమే నడవడానికి! బౌన్సర్ల నుండి తప్పించుకున్న ఒకరు స్థానిక సిపిఎం నేతలకు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకుపోవడంతో రంగంలోకి దిగారు. నిర్బంధంలో ఉన్న విద్యార్థి నేతలను విడించడంతో పాటు, కొందరు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి సినీ నటులు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణుతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ బరితెగింపు చర్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అప్పటికప్పుడే అనేక జిల్లాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. మోహన్‌బాబుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, మోహన్‌బాబు దిష్టిబొమ్మ దగ్ధానికి ఎస్‌ఎఫ్‌ఐతో పాటు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఏం జరిగింది…?
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబియు) యాజమాన్యం కొన్ని సంవత్సరాలుగా విద్యార్థుల నుండి వివిధ రకాల పేర్లతో ఫీజులు వసూల్లు చేస్తున్నారు. ఇది శృతిమించడంతో కొందరు తల్లితండ్రులు, విద్యార్థులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేసారు. ఉన్నత విద్యామండలి విచారణ జరిపి విద్యార్థుల నుండి 26 కోట్ల రూపాయలను వసూల్లు చేసినట్లు 2025 అక్టోబర్‌లో నిర్ధారించింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు వెంటనే చెల్లించాలని, అక్రమంగా వసూల్లకు పాల్పడినందుకు 15 కోట్ల రూపాయల అపరాధ రుసుము చెల్లించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. ఈ అదేశాలపై యాజమాన్యం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. దీంతో తల్లితండ్రులు మరోసారి ఉన్నత విద్యామండలిని ఆశ్రయించారు. యజమాన్యాన్ని కలవడానికి వచ్చిన తల్లితండ్రులను మోహన్‌బాబు కొడుకు మంచు విష్ణు బౌన్సర్లతో కొట్టించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దీనిపై ఆందోళనకు సిద్ధమయ్యారు. విద్యార్థి నాయకులను యాజమాన్యం అనేక రూపాల్లో బెదరించింది. కలెక్టర్ దృష్టికి మంగళవారం ఈ సమస్యను తీసుకరావడానికి సిద్ధమయిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను రెండు వాహానాల్లో మోహన్‌బాబు బౌన్సర్లు వెంబడించి రోడ్డుపైనే కొట్టి తమ వాహానాల్లో వేసుకుని వెళ్లారు. ఈ విషయాన్ని ఒక విద్యార్థి గమనించి సిపిఎం నాయకులు కందారపు మురళి దృష్టికి తేవడంతో ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. కిడ్నాప్ చేసిన నాయకులను నారావారిపల్లెలోని మోహన్‌బాబు ఫామ్‌హౌస్ దగ్గరకు తీసుకవెల్లి కొట్టారు. ఆ తర్వాత సమీపంలోని కొండపైకి తీసుకవెల్లారు. ఆ క్రమంలో కిడ్నాప్ కు గురైన అక్టర్ గట్టిగా కేకలు వేయడంతో పొలాల్లో వున్న రైతులు అక్కడికి రావడంతో మరోసారి విద్యార్థి నాయకులను వాహనంలోకి బలవంతాన తోసి మరో ప్రాంతానికి తీసుకవెల్లారు. ఈ లోపు అక్కడికి పోలీసులు రావడంతో వారికి రైతులు ఇచ్చిన సమాచారం ఆధారంగా బౌన్సర్ల వాహానాన్ని పోలీసులు వెంబడించి విద్యార్థి నాయకులను రక్షించారు. విద్యార్థి నేతలను రక్షించడానికి చంద్రగిరి సిఐ, తిరుచానూరు సిఐలతో కలుపుకుని మూడు బృందాలుగా గాలించారు. బౌన్సర్ల అదుపులో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్‌లను విడిపించి తీసుకొచ్చి ఎస్‌పి ముందుంచారు. దాడికి పాల్పడిన బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. దాడిని ప్రోత్సహించిన విద్యాసంస్థల యాజమానులైన మోహన్‌బాబు, విష్ణుతో సహా మొత్తం 20 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎ1గా పిఆర్‌ఒ సతీఫ్, ఎ2గా మోహన్‌బాబు, ఎ3గా మంచు విష్ణులను పేర్కొన్నారు. యు/ఎస్ 191 (2), 115 (2), 140 (1), 126 (2), 351 (2), ఆర్/డబ్ల్యు 190, 61 (2) సెక్షన్ల కింద తిరుచానూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అక్బర్, వినోద్‌లను కిడ్నాప్ చేసి, దౌర్జన్యానికి పాల్పడడాన్ని నిరసిస్తూ మోహన్‌బాబు దిష్టిబొమ్మను తిరుపతిలోని ఎస్‌వి యూనివర్సిటీ ప్రధాన కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు దహనం చేశారు. తిరుచానూరు పోలీసు స్టేషన్ ఎదుట, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు.
విజయవాడ లెనిన్ సెంటరులో ధర్నా నిర్వహించారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఫొటోలను దగ్ధం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, బి.నాసర్ జి.రాజేష్, శ్రీనివాస్ ప్రసంగించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్, డివైఎఫ్‌ఐ నాయకులు మద్దతు తెలిపారు.
కిడ్నాప్‌ను ఖండించిన సిపిఐ
మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యం బౌన్సర్లతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను కిడ్నాప్ చేయించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడడం గర్హనీయమని పేర్కొన్నారు. యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : డివైఎఫ్‌ఐ
అక్రమాలకు పాల్పడిన మోహన్‌బాబు వర్సిటీలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న తిరుపతి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, ఉపాధ్యక్షులు వినోద్‌లను మోహన్‌బాబు బౌన్సర్లు కిడ్నాప్ చేయడాన్ని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి రామన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయడాన్ని రాష్ట్ర ఎస్‌టి కమిషన్ మాజీ సభ్యులు, గిరిజన ప్రజా సమాఖ్య (జిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై ఎపి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందించారు.
నేడు మోహన్‌బాబు దిష్టి బొమ్మలు దహనం : ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు
కిడ్నాప్, దాడి ఘటనకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మోహన్‌బాబు దిష్టి బొమ్మలను దహనం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆటవిక చర్యకు పాల్పడిన కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్న కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి మోహన్ బాబు వర్సిటీ యాజమాన్యం వివిధ రకాలు ఫీజులు అధికంగా వసూలు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మోహన్‌బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలి కిడ్నాపర్లను కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం)ఏపీ డిమాండ్
తిరుపతిలో విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కిడ్నాపర్‌లను కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లాలో మోహన్‌బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి చెందిన గూండాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ధర్నాకు వెళుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్.అక్బర్ ఎస్.వి.యూనివర్సిటీ నాయకుడు వినోద్ కుమార్‌పై దాడిచేసి కిడ్నాప్ చేయడాన్ని ఖండించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నాయకులపై దారుణానికి పాల్పడినవారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని, గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేసినప్పటికీ ఎటువంటి మార్పు లేదని తెలిపారు. విద్యను అందించాల్సిన యూనివర్సిటీ ఇటువంటి నేర ప్రవత్తిగల వ్యక్తులను వినియోగించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.



