బీఆర్‌ఎస్, బీజేపీలకు భారీ షాక్
ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం
పీసీసీ చీఫ్‌తో సమన్వయం సక్సెస్
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జయకేతనం
ఇదే ఊపుతో స్థానికానికి అధికార పార్టీ సన్నాహాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలకు, బీజేపీ రాష్ట్ర లీడర్లకు భారీ షాక్…’ వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ జయకేతనం. సర్వేలు, మీడియా రిపోర్టులన్నీ అక్కడ బీఆర్‌ఎస్ విజయం ఖాయమంటూ ఢంకా బజాయించి చెప్పిన వేళ… సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో మరింత సమన్వయం చేసుకోవటం ద్వారా ఎంపీలు, మంత్రుల దగ్గర్నుంచి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా పార్టీ యంత్రాంగాన్ని మొత్తం యుద్ధానికి సిద్ధం చేశారు. తద్వారా గతంలో, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నడూ లేనంత ఐక్యతతో రేవంత్ పార్టీని ముందుకు నడిపించారు. ఈనెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగ్గా… వారం ముందు వరకూ బీఆర్‌ఎస్ గెలుస్తుందనే సంకేతాలు బలంగా వినిపించాయి. ఒకవైపు ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై సానుభూతి, దానికితోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉధృత ప్రచారం, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ క్షేత్రస్థాయికి దిగి పని చేయటం తదితరాంశాలన్నీ కారు పార్టీ విజయావకాశాలపై అంచనాలను పెంచాయి.
సరిగ్గా అప్పుడే రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులందరితో ప్రత్యేక భేటీ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఆయన నేతలకు ‘తనదైన’ శైలిలో దిశా నిర్దేశం చేశారు. ఎవరెవరు ఏమేం చేయాలనే విషయమై అప్పటికే సిద్ధం చేసిన ‘బ్లూ ప్రింట్’ను నేతల ముందు పెట్టారు. దానిపై పీసీసీ చీఫ్‌తో కలిసి సమాలోచనలు జరిపారు. పరిస్థితులకు తగ్గట్టు ఇరువురూ వ్యూహాలు రచించారు. ఆ వెంటనే వాటిని అమలు పరచాలంటూ నేతలకు, క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రచారాన్ని ముమ్మరం చేయటం, ఓటర్లను కలవటం, నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు ఫోన్లు చేయటం, పోల్ మేనేజ్‌మెంట్, బలహీతనలు, లోపాలను అధిగమించి, అందర్నీ ఒకే తాటిపైకి నడిపించటం తదితర పనులకు డివిజన్ల వారీగా బాధ్యులను కేటాయించి, వారిపై మంత్రులను ఇంఛార్జీలుగా నియమించారు. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా నివసిస్తున్న సినీ కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, వారి ఓట్లన్నీ కాంగ్రెస్‌కు గంపగుత్తగా పడేలా చేయాలంటూ డిప్యూటీ సీఎం భట్టికి సూచించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగటం సత్ఫలితాలనిచ్చిందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.
సీనియర్లను సైతం ఐక్యంగా నడిపించి…
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తమకంటే సీనియర్లుగా ఉన్న వారిని సైతం సీఎం, పీసీసీ చీఫ్ ఈసారి ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఐక్యంగా ముందుకు నడిపించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి, పొన్నం, వివేక్, జూపల్లి, సీతక్క, కొండా సురేఖ తదితరులు ప్రచారంలో పూర్తిగా నిమగమయ్యారు. ఇది మంచి ఫలితాన్ని ఇచ్చిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
మొదటి ఎన్నికతోనే మహేశ్ గ్రాండ్ విక్టరీ…
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికలోనే పార్టీకి గ్రాండ్ విక్టరీ అందించడం మహేష్ కుమార్ గౌడ్‌కు కలిసొచ్చే అంశం. ప్రతీ బూత్, ప్రతీ డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పోల్ మేనేజ్‌మెంట్‌ను ఆయన పకడ్బందీగా నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తోను, సీఎంతోనూ తరచూ జూమ్ సమావేశాల నిర్వహిస్తూ, నేతలతో నిరంతరం సమన్వయం చేసుకోవటం ద్వారా ఆయన ఈ ఉప ఎన్నికలో కీలక పాత్ర పోషించారని గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. జూబ్లీహిల్స్ విజయం ఇచ్చిన ఈ ఊపు, ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు వెళతామని ఆయా వర్గాలు తెలిపాయి.
‘షేక్‌పేట’ స్ట్రాటజీ…
ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న షేక్‌పేట డివిజన్‌లో తాను స్వయంగా పలుమార్లు పర్యటించటం ద్వారా బీఆర్‌ఎస్ దృష్టి అటువైపు సారించేలా సీఎం వ్యూహం పన్నారు. దాంతో గులాబీ పార్టీ నేతలు ఎక్కువగా అక్కడే ప్రచారం నిర్వహించారనీ, ఇదే అదనుగా హస్తం పార్టీ యంత్రాంగం మిగతా డివిజన్లపై ఫోకస్ పెట్టి, అక్కడి ఓటర్లను తనవైపు ఆకర్షించిందని సమాచారం.



