కార్మికులకు ఫ్యాక్టరీలో కనపడే శత్రువు సూపర్‌వైజర్. బయట కనపడే శత్రువులు ‘రాజులు’, అంటే రేవంత్‌రెడ్డి, కేసీఆర్, మోడీ! అంటే, వారంతా శత్రువులు కాదని కాదు. కర్రలు పట్టుకుని కొట్టుకునే కేతిగాళ్లు, బంగారక్కలే వారు! వెనకతాళ్లు లాగేవారు, అంటే సూత్రధారులను చూడకుండా పాత్ర ధారుల చుట్టూ కార్మికుల ఆలోచనలు తిరగనీయకుండా చూడటమే విప్లవ కార్మిక సంఘాల కర్తవ్యం. రాజ్యం నడిచేది వారి కోసం! నడిపేది వారే! ఇపుడు మోడీ అండ్ కో వారు ‘లేబర్ కోడ్స్’ తెచ్చారని చెప్పుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. ‘నాకేమైనా పెళ్లామా? పిల్లలా? ఆస్తి పోగేసుకుని ఏమి చేస్తాన’ని ఆయన కౌంటరిస్తే (ఆయనకున్న కార్పొరేట్ సంసారాన్ని మర్చిపోయి) అవునుకదా?! అనుకునే సంఖ్య ఈ దేశంలో ఎక్కువే! దానిపై చర్చకే ఈ వ్యాసం.
లేబర్ కోడ్స్‌పై ఇండియా బ్లాక్‌లో పెద్దగా నోరెత్తనిది కాంగ్రెస్ వారే! నాయనమ్మ చేసిన విషయాలు ఎవరో ఒకరు చెప్పరా మనవడిగారికి? నాటి కార్మికోద్యమాన్ని అణిచేయ డానికే 1975 జూన్ 25/26న ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందని మనకి తెలియంది కాదు. 2014 జూన్ నుండి మోడీ బృందం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీపై డైలాగుల మీద డైలాగులు కొడ్తూంటే, వారి అనుకూల మీడియా కోడై కూస్తూంటే, ఎవరెక్కువ దుర్మార్గాలకి పాల్పడుతున్నారో లెక్కలేసుకుంటే చాలదు. పెట్టుబడిదారుకి అనుకూలంగా ఎవరెక్కువ కార్మిక వర్గంపై దాడి చేస్తున్నారో ‘జోకాలి’ నాటి ఇందిర చర్యలు, నేటి మోడీ చర్యలు, ఒక్కమాటలో చెప్పాలంటే ‘రాజ్యం’ నడిచేది పెట్టుబడి దారులకోసమే! నడిపేది రాజకీయ నాయకులే!
కార్మికుల జీతాలు పెరగకుండా 1974 జులై 6 నాడే ఇందిరాగాంధీ వేతనస్తంభన (వేజ్‌ఫ్రీజ్) ఆర్డినెన్స్ జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు, ప్రయివేటురంగంలోని కార్మికులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, కార్మికులు-అందరి డీఏను స్వాధీన పరుచుకుంది. పెరగాల్సిన వేతనాన్ని, డీఏలను (సీడీఎస్) కంపల్సరీ డిపాజిట్ స్కీంలో జమ చేస్తానంది. ప్రస్తుత కార్మికులకే కాదు, వివిధస్థాయిల్లోని నాయకులకు కూడా తెలియని విషయమిది. ”1966-76 మధ్య దశాబ్దకాలంలో ప్రతి ఏడాదీ 15 లక్షల మంది కార్మికులు సమ్మెలుచేశారు. భారత సమాజంలోని మరే ఇతర సెక్షను ప్రజలూ ఈ విధమైన ప్రతిఘటన ఇవ్వలేదు.
1972-75 మధ్య సమ్మెలు, లాకౌట్‌లవల్ల నష్టపోయిన పనిదినాలు రెండు కోట్లకుపైగానే ఉన్నాయి. రైల్వే సమ్మెవల్ల 1974లో 3 కోట్ల 10 లక్షలకు పైగానే ఉన్నాయి” (1975 మేలో బొంబాయిలో జరిగిన అఖిల భారత 3వ మహాసభలో బీటీఆర్ అధ్యక్షోపన్యాసం నుండి) చట్టం చేయడం, దాని అమలుకు ఆర్డర్ ఇవ్వడం దానిపై ఆధారపడ్డ వేతనం, డీఏ నిర్ణయించడం, యజమానుల ఇష్టంపై ఆధారపడి దాన్ని ఎప్పుడైనా ఉపసంహరించడం-ఇది మన దేశంలో కొత్త. కార్మికోద్యమ అంతానికి ఇది ఆరంభం. ఇది సమిష్టి బేరసారాల హక్కుతోపాటు, వర్గ పోరాటాన్ని అణిచివేసే ఒక చర్య. వేతనాలపై దాడి ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై నియంతృత్వానికి ఇది దారి తీస్తుంది!” అన్నారు బీటీఆర్.
వేతన స్తంభన చట్టం ముతకది. దాన్ని నగిషీ చెక్కి ‘జాతీయ వేతన విధానం’ అన్నారు. దీన్నే ఆనాటి ఐఎన్‌టియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి రామానుజం ‘నేషనల్ వేజ్ కమిషన్’ కార్మికులకు న్యాయం చేయడం కంటే, వేతనాలను నియంత్రించే ‘వాచ్‌డాగ్’లా ఉంటుందని నిస్సిగ్గుగా చెప్పాడు. అన్ని వేతన ఒప్పందాలూ ఈ కమిషన్ ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకొస్తాయి. ఇది నాటి దశ. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మరో కీలక ఆయుధం ఇండస్ట్రియల్ రిలేషన్స్ బిల్లు. (నేటి ఐఆర్‌కోడ్‌కు పిండరూపం అది) కార్మికుల కోసం బేరసారాలాడే యూనియన్ ఏది? దాని ఎంపిక ఎలా? ఇది ఒకటికాగా తప్పనిసరిగా మధ్యవర్తి తీర్పుకు (కంపల్సరీ ఆర్బిట్రేషన్) కట్టుబడటం మరో ముఖ్యమైనది.
యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే యూనియన్లను ప్రభుత్వం ప్రోత్సహించడంతో కార్మికుల పక్షాన నిలబడి పోరాడే యూనియన్లు పెరిగాయి. నాటి మంత్రులు, అధికారుల నోట యూనియన్లు పెరిగిపోతు న్నాయి. కావున వాటిని నియంత్రించాలనే మాట, చివరికి ఇందిరాగాంధీ నోట ఒక పరిశ్రమలో ఒకటే యూనియన్ ఉండాలనే మాట వచ్చింది. ఇది ‘ఒక దేశం ఒక రాజకీయ పార్టీ’ అనే దానికి దారితీస్తుందనే మాట పై ఉపన్యాసంలో బీటీఆర్ చెప్పారు. దీని మరో రూపమేగా నేడు మోడీ నోట వింటున్నాం. అప్పుడు ఐఎన్‌టియుసి, ఏఐటియుసిలే దానికి భజన చేసినాయి. ప్రస్తుతం బీఎంఎస్ తప్ప మోడీ భజనకి ఎవరూ సిద్ధపడటం లేదు. అదీ కింది నుండి వచ్చిన వత్తిడితో సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇది ఒక కీలక పరిణామం.
”బండెడు అబద్ధం కంటే చిటికెడు సత్యం కలిపిన అబద్ధం ఎక్కువ ప్రమాదకరమైంది” దోస్తోవ్‌స్కీ
ఒకరోజు మా ఇంటి నుండి నేను నడుస్తూ సీఐటీయూ రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరాను. మందులతో నిండిన పొట్టలోకి ఇంకొన్ని మందులు నింపే ప్రయత్నంలో మెడికల్ షాపుకెళ్లి దానినుండి బయటికి రాగానే అక్కడి నుండి దాదాపు ముప్పావు కి.మీ. ఆటోలైనుంది. అది మామూలే కదా అని కొట్టేయకండి! ఆ గ్యాస్ పెట్రోల్ బంక్ అవతలవున్న దర్గా సమీపంలో శ్రీరామనవమి సందర్భంగా ఓ చిన్నసైజు శోభాయాత్ర కోసం కాషాయ జండాలున్న బైకులు, స్కూటర్లు జమవుతున్నాయి. అందులో కొన్ని ఆటోలూ ఉండటం ఆశ్చర్యం. ఇది ఒక వైరుధ్యం కాదు! ఇదే నేటి వాస్తవం. పెరిగిన పెట్రోలు, గ్యాస్ ధరలపై కోపం కాషాయంతో ‘చల్లారిపోయింది’. కొందరైతే తమ ప్రభుత్వరంగ పరిశ్రమలు, తమ బ్యాంకులు, తమ ఎల్‌ఐసి, తమ రైల్వే ప్రభుత్వరంగంలోనే ఉండాలని, తమ జీతాలు, పెన్షన్ చల్లగా ఉండాలని కలలుకంటూంటారు.
అదేరోజు మరో ఘటన మన రాష్ట్రంలో జరిగింది. అంగన్‌వాడీలు తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని ఎప్పట్నించో కోరుతూంటే ”మీరంతా ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే వారనీ, మీకు ప్రభుత్వానికి సంబంధమేమిటని” సర్కారు ఎదురు ప్రశ్న. మర్చి 23 ఒక జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేశాడని ”గౌరవ ముఖ్యమంత్రిపై అనుచిత”వ్యాఖ్యలు చేశారని, దానిపై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించండని జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు నుండి షోకాజ్ నోటీసు ఇచ్చారు. స్పష్టంగా కలెక్టర్‌గారి ఆధ్వర్యంలో ఉండే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద అంగన్‌వాడీలు పని చేస్తున్నారని అర్థం కావడంలేదా?
”దున్నేటప్పుడు దూడల్లో, మేసేటప్పుడు దున్నల్లో” సామెత బహుశా తెలీని వారుండరు. జీతాలు, ఇతర ప్రయోజనాలు వచ్చేసరికి మీరందరూ ‘దూడలు’ పోండని వెళ్లగొడ్తున్నారు. పని దగ్గరికి వచ్చేసరికి మెడమీద కాడేసి దున్నల్లా పని చేయిస్తున్నారు. మహిళా కార్మికుల్ని మహిళా పోలీసుస్టేషన్లలో నిర్బంధించాలని అందరికీ తెలిసిన న్యాయసూత్రం. జాలీ కిటికీలు ఎత్తులో వున్న, పూర్తిగా మూసేసిన పోలీసు వ్యాన్‌లో 4, 5 గంటలు తిప్పి కనీసం మూత్రవిసర్జనకు కూడా ఆపకుండా ఉంటే కడుపు మండదా? కారణం తెలుసుకో కుండా, కారణం చూడకుండా ముఖ్యమంత్రిని దూషించారనడం న్యాయమేనా? కనీస మానవత్వంతో ఆలోచించాల్సిన కేసును షోకాజు నోటీసులు, చార్జిషీట్ల దాకా పోవడం సరైందికాదు. ఈ విషయం ప్రభుత్వం సైతం అర్థం చేసుకోవాలి.
మళ్లీ ‘రాజ్యం’ దగ్గరకొద్దాం..
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కొన్ని పార్టీల బృందం (ఓల్డ్ కాంగ్రెస్, జన సంఘం, సోషలిస్టు పార్టీ, లోక్‌దళ్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ) కలిసి 1977 ఎన్నికల్లో ఓడించింది. ఎమర్జెన్సీని ఓడించిన ఈ బృందం కార్మికులకు సంబంధించిన అంశాల్లో ఇందిరాగాంధీ విధానాన్నే కొనసాగించింది. జనతా ప్రభుత్వం ఐఆర్ బిల్లులోని 12 పాయింట్ల లిస్టు చూస్తే దాదాపు అన్ని రంగాల్లో సమ్మెల నిషేధం విధించబడింది. ఐఆర్ బిల్లులోని 157వ క్లాజు ప్రకారం సంబంధిత ప్రభుత్వాలు మరిన్ని పరిశ్రమలను ఆ లిస్టులో చేర్చవచ్చు. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులను రిట్రెంచ్ చేయడంగానీ, లే ఆఫ్ చేయడం గాని ఏ ఫ్యాక్టరీలో చేయరాదు. అరవైరోజుల్లో ప్రభుత్వం నుండి ఏ సమాచారం లేకుంటే ఇచ్చినట్టుగా భావించవచ్చు. సమ్మె చేస్తున్నట్లు ఆరు వారాల ముందు యాజమాన్యానికి తెలియజేసి, 14 రోజుల ముందు సమ్మె చేస్తున్నట్లు నోటీసు ఇవ్వాలంట! ఇది అన్ని పరిశ్రమల్లోనట! సెక్షన్ 120 మరీ ఘోరం! ప్రభుత్వరంగ పరిశ్రమైతే తీర్పువచ్చిన తర్వాత అది కార్మికులకు అనుకూలంగా ఉంటే దాన్ని మార్చే హక్కు ప్రభుత్వాని కుంటుందట! మొరార్జీ దేశారు సైతం పెట్టుబడి దారుల కోసం నిలబడిన (గుజరాత్) వ్యక్తేనని మరువద్దు.
ఇటువంటివెన్నో అప్పటి ఐఆర్ బిల్లు కడుపు నిండా ఉన్నాయని గుర్తుంచుకుంటే.. రాజ్యం దాదాపు యాభై యేండ్ల ప్రయత్నం నేటి కోడ్స్ రూపంలో విజయవంతమైందని వారి ఆనందం. ఆనాటికి పెట్టుబడిదారుల ప్రధాన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ తొక్కినదారి కొన్ని పార్టీల బృందం కలిసి, జనతాగా ఏర్పడి రాజకీయంగా ఓడించినా అదే దారితొ క్కాయి. ఆ జనతా పార్టీలో ప్రధాన భాగస్వామి భారతీయ జన సంఘం, నేటి బీజేపీ మాతృక. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కార్పొరేట్ల వైపు మొగ్గి, తమ మిత్రులనందరిని వంచగలుగుతున్నప్పుడు కార్మికవర్గ ప్రయోజనాల కోసం పోరాడే కమ్యూనిస్టుల బలం సన్నగిల్లిన తర్వాత రాజకీయ పార్టీలవైపు చూస్తూ కూచుంటే పరిష్కారాలు దొరకవు. చరద్రబాబు పాలనలో రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆర్టీసీ డిపోలవద్ద ఉపన్యాసాలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఉపన్యాసాలు విన్నవారికి, విని ఆనందించిన కార్మికులు 2005లో జిఓ 11 అనుభవాలు, తెలంగాణ వచ్చేముందు 2012, 2013ల్లో కేసీఆర్ ఉపన్యాసాలు విని కేరింతలు కొట్టిన కార్మికులు నేటి వాస్తవాలు చూస్తూనే, అనుభవిస్తూనే ఉన్నారు కదా!?
బీజేపీ వస్తే, మోడీ రాజ్యమొస్తే రామరాజ్యమొచ్చినట్లేనని ఆనందించిన వారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేమైనాయో, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లేమైనాయో ఆ ‘పరమాత్ముడి’కే ఎరుక! కుర్చీ ఎక్కేముందు ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, ఆ మత్తులో జనం తేలియాడుతూంటే 2016లో పెద్ద నోట్లరద్దు, క్యూల్లో నిలబడలేక పడిపోయి చనిపోవడాలు, ఈ బాధల్లో జనం అల్లాడుతోంటే 2017 జూన్‌లో జీఎస్‌టీతో అందరికీ ఏదో వచ్చేస్తుందన్న హడావుడి, దాని భారాలపై జనం మొత్తుకునేటప్పుడు పుల్వామా ఘటన. ఆ తర్వాత మన వైమానిక దళవీరులు పాక్‌లోకి చొరబడి బాంబులేసి జేషేమొహ్మద్ ఉగ్రవాదుల్ని చంపి తిరిగొచ్చారని చెప్పుకున్న సర్జికల్ స్ట్రైక్ రచ్చలో 2019 ఎన్నికల్లో విజయం.
2020 ప్రారంభంలో కోవిడ్ కల్లోలం ప్రారంభం, దాని విరుగుడుగా ఆగస్టు 5, 2020న రామాలయ భూమిపూజ. కోవిడ్‌చావులు కప్పిపుచ్చేయడం, గిన్నెలు, పళ్లాలు కొట్టమన్నది క్రమంగా జనం బుర్రల్లోంచి తొలగించేయడం! ఈ మధ్యలో డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియాలతో జనం బుర్రలు డైవర్ట్! 2024 ఎన్నికల ముందు అయోధ్యలో రామాలయ ప్రారంభం, దేశ, విదేశాల నుంచి యాత్రికుల తరలింపు. ఇవి చాలవా మూడుసార్లు మోడీ గెలవడానికి?! రాజ్యం వీరభోజ్యం అనేది పాతమాట. రాజ్యం పెట్టుబడి దార్ల భోజ్యం ఇది నేటిమాట. అంబులపొదిలో బాణాలు ఇంకా చాలా ఉన్నాయి. జనంలో అసంతృప్తి పెరిగేకొద్దీ ఒక్కొక్కటే బయటికి తీస్తున్నారు. పారాహుషార్!
ఆర్.సుధాభాస్కర్



