Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం9న కిసాన్‌, మజ్దూర్‌ పార్లమెంట్‌

9న కిసాన్‌, మజ్దూర్‌ పార్లమెంట్‌

- Advertisement -

రైతు వ్యతిరేక విధానాలపై నేటి నుంచి గ్రామాల్లో సభలు, తీర్మానాలు
పోస్టుకార్డు ద్వారా రాష్ట్రపతికి పంపించాలి : ఎస్‌కేఎం పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి ఒకటి నుంచి గ్రామాల్లో సభలు నిర్వహించి, తీర్మానాలను చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. గ్రామాల్లో చేసిన తీర్మానాలను పోస్టుకార్డు ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రాలు పంపించాలని కోరింది. మార్చి 9న ఢిల్లీలో కిసాన్‌, మజ్దూర్‌ పార్లమెంటు నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్‌, బి.రాము, డిజి.ప్రసాద్‌, మండల వెంకన్న, బుర్రి ప్రసాద్‌, జక్కుల వెంకటయ్య, మామిడాల బిక్షపతి, విజరు తదితరులు విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు పోష్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్శంగా వారు మాట్లాడుతూ అమెరికాతో భారతదేశం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగు లేబర్‌ కోడ్లను ఉపసంహరించుకోవాలనీ, విద్యుత్‌ బిల్లు 2025, విత్తన బిల్లు 2025 తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. వీబీ జీఆర్‌ఏఎం జీ చట్టం 2025ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బహుళ జాతి కంపెనీల విత్తనాలను దిగుమతి చేసుకోవడం, ఇష్టానుసారంగా వసూలు చేసే అవకాశం, విత్తనాలను నిల్వ చేసి మార్కెట్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చేలా కొత్త విత్తన చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం భారతదేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అమెరికాకు అప్పగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని తెలిపారు. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు 60 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రైతులు నిర్వహిస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం అండగా నిలబడాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -