జిల్లా, మండల కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించాలి
గోడపత్రిక ఆవిష్కరణలో టి.సాగర్, సారంపల్లి పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 90వ వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో దానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న లక్నోలో స్వామి సహజానంద్ సరస్వతి నేతృత్వంలో ఏఐకేఎస్ ఏర్పాటైందనీ, ఇది దేశంలోనే అతి పెద్ద రైతు సంఘం అని చెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, జమీందారీ వ్యవస్థ రద్దు, భూ సంస్కరణలు, రుణ విముక్తి రైతుల హక్కుల కోసం పోరాడిందని గుర్తుచేశారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ఏఐకేఎస్ ముందు వరుసలో ఉందని చెప్పారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏఐకేఎస్ ఆవిర్భావ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామ గ్రామాన జెండావిష్కరణలు చేసి ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, శివ, తదితరులు పాల్గొన్నారు.



