ఏపీకి ఏడు మండలాల అప్పగింత పాపం వారిదే
పునర్విభజన చట్టానికి సవరణ చేసిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చరిత్రను వక్రీకరించడం దుర్మార్గం : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదటి నుంచీ ద్రోహం చేస్తున్నారనీ, ఉద్యమ సమయంలోనూ తన పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకు తిరిగారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. పునర్విభజన చట్టానికి సవరణ చేసి ఏపీకి ఏడు మండలాలను అక్రమంగా కట్టబెట్టింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని ఎత్తిచూపారు. పునర్విభజన చట్టంలో ఉంది కాబట్టే ఏపీకి ఏడు మండలాలు అప్పగించాల్సి వచ్చిందని రాజ్యసభలో కిషన్‌రెడ్డి మాట్లాడటాన్ని ఆక్షేపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కిషన్‌రెడ్డి కించపర్చారని విమర్శించారు. కాళేశ్వరం పై రేవంతు చేస్తున్న దుష్ప్రచారాన్ని వల్లెవేస్తూ కిషన్‌రెడ్డి విషం కక్కుతున్నారని పేర్కొన్నారు.
2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా..2023 నాటి అది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆనాడు కాళేశ్వరంపై ప్రశంసలు కురిపించి నేడు రాజకీయ లబ్ది కోసం అబద్దాలు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. పంట పొలాల్లో పారుతున్న కాళేశ్వరం జలాలను చూపించేందుకు తాను సిద్ధమనీ, వచ్చే దమ్ము మీకు ఉందా? అని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ జేబులో నుంచి ఖర్చుపెట్టారా? అని కిషన్‌రెడ్డి అనటాన్ని తప్పుబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదార్లు, ప్రాజెక్టులకు మీ సొంత పైసలు ఖర్చు పెడుతున్నారా? అని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలనీ, తెలంగాణకు నిధులు కేటాయించాలని తమ ఎంపీ సురేశ్‌రెడ్డి హుందా ప్రశ్న అడిగితే కిషన్‌రెడ్డి వ్యర్థ రాజకీయ ప్రేలాపనలకు పాల్పడ్డారని విమర్శించారు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు.



