– సీఎం చెప్పిందేమిటి? మీరు ప్రచారం చేస్తున్నదేమిటి? : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఫైర్
– మావోయిస్టులు వస్తామంటే పార్టీలోకి ఆహ్వానిస్తాం
– అన్ని రంగాల్లో మోడీ విఫలమయ్యారంటూ ఆగ్రహం
– జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ‘రాజ్యసభ’ అడగలేదని వివరణ
– మార్చి చివరి నాటికి కార్పొరేషన్ పదవుల భర్తీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘గాంధీ కుటుంబానికి అవసరమైతే వెయ్యి కోట్లు సమకూరుస్తాం…’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శిక్షణా తరగతుల్లో వ్యాఖ్యానించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం చేయటాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘కిషన్‌రెడ్డీ… ఎందుకింత అవివేకం…?’ అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘రాహుల్ గాంధీ ముత్తాతల దగ్గర్నుంచి ఆయన తండ్రి రాజీవ్ గాంధీ వరకూ అందరూ దేశం కోసం ఆస్తులను త్యాగం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏకంగా ప్రాణాలనే అర్పించారు. అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ… లోక్‌సభ సభ్యత్వాన్ని మోడీ సర్కార్ రద్దు చేస్తే, ఆయన కట్టుబట్టలతో రోడ్డు మీదికొచ్చారు. ఆయన కోసం కాంగ్రెస్ పార్టీ విరాళాలకు పిలుపునిస్తే వెయ్యి కోట్లు సమకూరుతాయి…’ అని మాత్రమే సీఎం పేర్కొనట్టు మహేశ్ వివరించారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించటం తగునా? అని కిషన్‌రెడ్డిని నిలదీశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్.. పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తమ పార్టీలోకి వస్తామంటే స్వాగతం పలుకుతామని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకూ ఎవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌తో చర్చలకు ఒప్పుకున్న ప్రధాని మోడీ…మనదేశంలోని మావోయిస్టులతో మాత్రం చర్చలకు ఒప్పుకోలేదని ఎద్దేవా చేశారు. మావోయిస్టుల సిద్ధాంతంపై తమకు భిన్నాభిప్రాయాలున్నాయని తెలిపారు. అయితే ప్రజల కోసం పోరాడిన వారిపట్ల తమకు గౌరవం ఉందన్నారు. హింస ఎటువైపు నుంచి (మావోయిస్టులు, పోలీసులు) జరిగినా దాన్ని వ్యతిరేకించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌లో అడ్డంగా దొరికిపోయిన ఆయన గురించి ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఏం చెబుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత విదేశాంగ విధానం అత్యంత దారుణంగా ఉందని వాపోయారు. దేశంలో తర్వలోనే చమురు ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ యుద్ధానికి సిద్ధం కావాలంటూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ… శిక్షణా తరగతుల్లో తమకు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఖమ్మం భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించి కేరళ సీఎం పినరయి విజయన్ ట్వీట్‌ను పాత్రికేయులు ప్రస్తావించగా…’ఆయన ఇక్కడి పరిస్థితులను పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో..?’ అని వ్యాఖ్యానించారు. విజయన్ ట్వీట్ వెనుక రాజకీయ కోణమేదైనా ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయినా ఈ అంశాలన్నింటిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మాట్లాడారని గుర్తు చేశారు. ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వబోతున్నారా? అని అడగ్గా…’ఆయన ఆ పదవిని ఇవ్వాలంటూ అడగలేదు…’ అని సమాధానమిచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ సీట్లన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందని విమర్శించారు. కానీ తమ పార్టీ అందుకు భిన్నంగా మేధావులు, వివిధ రంగాల్లో నిష్టాణితులకు వాటిని కేటాయించాలని భావిస్తోందని తెలిపారు. మార్చి చివరి నాటికి డీసీసీల పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మెన్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. వాటిపై కసరత్తులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో డీసీసీలకు పది రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలు, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జయప్రదమయ్యాయని వివరించారు. వీటి నిర్వహణ పట్ల రాహుల్ గాంధీ సంతృప్తిని వ్యక్తం చేశారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
కిషన్‌రెడ్డీ.. ఎందుకీ అవివేకం…?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



