చమురు నిల్వలపై అమెరికా దాడితో నిలిచిన సరఫరా
ఒక్కసారిగా పెరిగిన వంటగ్యాస్ ధరలు
గ్యాస్ బుకింగ్ గడువు పెంచిన సర్కార్
మెట్రో నగరాల్లో మూతపడనున్న హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశంలోని అనేక నగరాలలో ఎల్పీజీ సరఫరాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. సింగిల్ సిలిండర్లతో కాలంవెళ్ల దీస్తున్న కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవటానికి ఆ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఇంతకు ముందు సిలిండర్ ధర రూ.600 ఉంటే..మోడీ వచ్చాక అది రూ.వెయ్యి రూపాయలకు చేరింది. దీంతో వచ్చే జీతంలో సిలిండర్‌కే రూ. వెయ్యి పోతే..మిగిలిన పైసలతో ఎలాగోలా బతుకుబండి లాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సడన్‌గా సిలిండర్ల వాడకంపై గడువు పెంచారు. ఇప్పుడు గ్యాస్ కోసం బుక్ చేస్తే.. 20 రోజుల తర్వాతే చూద్దామన్నట్టు కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో మహిళలు వంట కోసం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. ఎవరికీ తెలియదు. ట్రంప్, నెతన్యాహులు కూడా ఇప్పుడు తలపట్టుకునే పరిస్థితి ఏర్పడినట్టు సంకేతాలు వస్తున్నాయి.
30 రోజుల వరకు చమురు సరఫరాకు టెన్షన్ లేదని ట్రంప్ ..మోడీకి భరోసా ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. కానీ గ్యాస్ విషయంలో అలాంటి సంకేతాలు రాకపోవడంతో మోడీ సర్కార్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంకోవైపు ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించాలంటే ఖాళీ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. సిలిండర్లు పట్టుకుని సరఫరా కేంద్రాల వద్దకు ఇంటి యజమానులు పరుగులు తీస్తున్నారు. ”సార్..మా దగ్గర ఒకటే గ్యాస్ సిలిండర్ ఉన్నది. ప్లీజ్ నింపి ఇవ్వండి” అని వినియోగదారులు ఏజెన్సీ వారిని బతిమిలాడుతున్నారు. ఎక్కడైనా జనం అవసరాలు ఉన్న చోట బ్లాక్ మార్కెట్‌దందాకు తెరలేపటం కామన్.. మోడీ ప్రభుత్వ ఆంక్షలతో గ్యాస్ బుకింగ్ సెంటర్లు దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంట చేసుకోలేక బయటికి వెళ్లి కర్రీ పాయింట్ల నుంచి కూరలు తెచ్చుకుందామనుకుంటే.. వాళ్లూ గ్యాస్ లేక బంద్ చేస్తున్నారు. ఇక బ్యాచ్‌లర్ల పరిస్థితి మరీ దారణంగా తయారైంది. హాస్టళ్లకు సరఫరా అయ్యే సిలిండర్లు లేక…తిండి పెట్టడం మావల్ల కాదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లకు తాళాలు
యుద్ధం కారణంగా ఆతిథ్య రంగం సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లకు తాళాలు వేయక తప్పదని అంటున్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్టాలలోని సగానికి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. మిగతావి కూడా మూసుకోకతప్పదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మెట్రో నగరాలలో గ్యాస్ సరఫరా సరిగా జరగడం లేదు. ముంబయిలో త్వరలోనే రెస్టారెంట్లు మూతపడబోతున్నాయని ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపారు. కొరత ఇలాగే కొనసాగితే రెండ్రోజుల్లో ముంబయిలోని అన్ని రెస్టారెంట్లను బంద్ చేసుకోక తప్పదని ఆయన చెప్పారు.
ఇప్పటికే తమ సంఘానికి చెందిన 10-20 శాతం మంది సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, రేపటికి అది 60 శాతానికి చేరుతుందని అన్నారు. ముంబయిలో ఆదివారం నుంచే వాణిజ్య ఎల్పీజీ సరఫరాలు నిలిచిపోయాయని రెస్టారెంట్ల యజమానులు తెలిపారు. కాగా గృహ వినియోగదారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. సిలిండర్‌ను బుక్ చేసిన తర్వాత ఎనిమిది రోజుల వరకూ ఎదురు చూడాల్సి వస్తోందని వారు చెప్పారు. అటు బెంగళూరులోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయింది. బుధవారం నుంచి హోటళ్లను మూసేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. విద్యార్థులు, కార్మికులు, వైద్య సిబ్బంది సహా రోజువారీ ఆహార అవసరాల కోసం హోటళ్లపై ఆధారపడుతున్న వేలాది మందికి ఇబ్బంది తప్పదని చెప్పింది. గ్యాస్ లేనిదే ఏం చేయగలమని యజమానులు ప్రశ్నిస్తున్నారు.
చెన్నై, పూనే నగరాలలో కూడా ఎల్పీజీకి కొరత ఎదురవుతోంది. కాగా గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఎల్పీజీ సరఫరాలు స్థిరంగా ఉండేలా చూసేందుకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, అదనపు ఉత్పత్తిని గృహ వినియోగాలకు మళ్లించాలని సూచించింది. వాణిజ్య ఎల్పీజీపై ఆధారపడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర పరిశ్రమల అభ్యర్థనలను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అరతే కాదు గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా కేంద్రం ఎస్మా చట్టాన్ని బనాయించింది. కానీ ఈ చర్యలు వార్‌కు ముందు తీసుకుని ఉంటే బాగుండేదని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి.



