హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి నెథర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చామని కెఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెఎల్‌ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టిన్ స్టినెన్ మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల మధ్య నేరుగా కొత్త విమాన సర్వీసులను ప్రారంభించామన్నారు. భారత్‌లో ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నగరాలకు సేవలను కలిగి ఉన్నామని.. హైదరాబాద్‌ను జోడించడం ద్వారా నాలుగు గమ్యస్థానాలకు విస్తరించినట్లయ్యిందన్నారు. సెప్టెంబర్3న తొలి విమానం కెఎల్ 874 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్ స్కిప్హోల్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిందన్నారు. దీంతో ప్రపంచ నెట్‌వర్క్‌ను 160కి పైగా గమ్యస్థానాలకు చేర్చినట్లయ్యిందన్నారు. భారత్ నుంచి వారానికి 27 విమానాలు రాకపోకలను కొనసాగిస్తాయన్నారు.