Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొడంగల్‌ బంద్‌ విజయవంతం

కొడంగల్‌ బంద్‌ విజయవంతం

- Advertisement -

మెడికల్‌ కాలేజీ,సమీకృత గురుకులాలు తరలించొద్దు : కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ జేఏసీ డిమాండ్‌

నవతెలంగాణ-కొడంగల్‌
మెడికల్‌ కళాశాల, సమీకృత గురుకులాలను ఇతర ప్రాంతాలకు తరలించొద్దని కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (కేడీసీ) జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన కొడంగల్‌ బంద్‌ గురువారం విజయవంతమైంది. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, ఇతర వాణిజ్య, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా కేడీసీ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేఏసీ కన్వీనర్‌ లక్ష్మీనారాయణ గుప్తా, కో-కన్వీనర్లు గంటి సురేష్‌కుమార్‌, ఎరన్‌పల్లి శ్రీనివాస్‌, రమేష్‌బాబు, సలహాదారులు దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్‌ మాట్లాడారు. కొడంగల్‌ ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న మెడికల్‌ కళాశాల, సమీకృత గురుకులాలను ఇప్పుడు ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతం పట్ల సీఎం చిత్తశుద్ధి అర్థమవుతుందని ఆరోపించారు. కొడంగల్‌ ప్రాంతం ఏండ్లుగా వెనుకబాటుకు గురైందన్నారు.

ఈ ప్రాంత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశ పడ్డామని చెప్పారు. కానీ కొడంగల్‌ ప్రజల ఆశలను వమ్ము చేశారన్నారు. ఇక్కడికి మెడికల్‌ కళాశాల, సమీకృత గురుకులాలతో పాటు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని తెలిపారు. మెడికల్‌ కళాశాల, సమీకృత గురుకులాల తరలింపును వ్యతిరేకిస్తూ వారం రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బుస చంద్రయ్య, నవాజ్‌, రమేష్‌బాబు, వెంకట్‌రామ్‌రెడ్డి, మాసాని వెంకటయ్య, అనిల్‌, నందరం రాజేందర్‌, ప్రవీణ్‌, పవన్‌, శాంత్‌కుమార్‌, భీమ్‌ రాజు, రవీందర్‌నాయక్‌, మురళీధర్‌రెడ్డి, నజర్‌, సూర్యనాయక్‌, ఓం భాను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -