Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅశ్వారావుపేటలో కొడంగల్‌ రైతుల అధ్యయన యాత్ర

అశ్వారావుపేటలో కొడంగల్‌ రైతుల అధ్యయన యాత్ర

- Advertisement -

– ఆయిల్‌ పామ్‌ సాగుపై అవగాహన
– సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతో ముందడుగు
నవతెలంగాణ-అశ్వారావుపేట

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సాగవుతున్న ఆయిల్‌ పామ్‌ అధ్యయన యాత్రకు తీసుకువచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి విజన్‌లో భాగంగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ జంగా రాఘవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రైతు అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రైతులకు ప్రాయోజిత అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు చెప్పారు. ఇప్పటికే ఆయిల్‌ పామ్‌ సాగులో ముందంజలో ఉన్న అశ్వారావుపేటలో రైతులు తోటల నిర్వహణ, సాగు పద్ధతులు, దిగుబడులు, మార్కెట్‌ అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతుల ఆదాయం పెంపుతోపాటు పరిశ్రమల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో కంటే అయిల్‌ పామ్‌ సాగు రెట్టింపు చేశామని, సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. అతి త్వరలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరి గూడెంలో నిర్మిస్తున్న పరిశ్రమను ప్రారంభిస్తామని, అదే క్రమంలో అశ్వారావుపేటలో మరో నూతన పరిశ్రమకు నిర్మాణ పనులు మొదలు పెడతామని అన్నారు. కొడంగల్‌లో ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల రైతులకు స్థిరమైన మార్కెట్‌తో పాటు మెరుగైన ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని కొడంగల్‌ అధికారులు తెలిపారు. కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కేఏడీఏ) చైర్మెన్‌ వెంకట్‌ రెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ ఓఎస్డీ అడపా కిరణ్‌ కుమార్‌, ఆయిల్‌ ఫెడ్‌ ఓపీడీ మేనేజర్‌ ప్రవీణ్‌ రెడ్డి, జిల్లా మేనేజర్‌ శబావత్‌ శంకర్‌ రైతులకు పలు సూచనలు చేశారు. కొడంగల్‌, నారాయణపేట ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -