నవతెలంగాణ
సర్పంచి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థుల కసరత్తులు వేగం పుంజుకున్నాయి. స్థానాలు రిజర్వేషన్ ఆధారంగా ఖరారవడంతో ప్రతి గ్రామంలో సామాజిక వర్గాల సమీకరణలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పోటీదారుల సంఖ్య ఈసారి భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తాటిపాముల గ్రామం రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో కోల రమేష్ గౌడ్ నిలవనున్నారన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. జర్నలిస్టుగా పనిచేస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రమేష్ గౌడ్ గ్రామాభివృద్ధిపై ఎప్పటికప్పుడు స్వరం వినిపిస్తూ ఉండటం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రమేష్ గౌడ్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గ్రామంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువతకు అవకాశాలు, సామాజిక ఐక్యత, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై రమేష్ గౌడ్ దృష్టిసారిస్తారని ఆయన సన్నిహితులు అభిప్రాయం. రమేష్ గౌడ్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం అని గ్రామ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.



