Thursday, March 19, 2026
E-PAPER
Homeఆటలుకోల్‌కతా కూల్‌గా..

కోల్‌కతా కూల్‌గా..

- Advertisement -

– మూడుసార్లు ఛాంపియన్‌ నైట్‌రైడర్స్‌
– రహానేకు మళ్లీ పగ్గాలు
కోల్‌కతా:
కూల్‌గా కనిపించే కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కెకెఆర్‌) ప్రతి సీజన్‌లోనూ అత్యద్భుత విజయాలతో సత్తా చాటుతోంది. బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ యజమాన్యంలో జుహీచావ్లా, జే మెహతా పర్యవేక్షణలో ఆ ఫ్రాంచైజీ అంచనాలకు మించి రాణిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో స్టార్‌ ప్లేయర్లు ఈ జట్టుకు అండగా ఉన్నారు. వారు ఏ దశలోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సమర్థులు. వారే మ్యాచ్‌లను గెలిపిస్తారు.. అద్భుతాలను సృష్టిస్తారు.. కెకెఆర్‌ జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్క పర్పుల్‌ క్యాప్‌ను గెలుచుకోలేదు. ఒకసారి మాత్రమే ఆరెంజ్‌ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌) క్యాప్‌ సాధించారు. 2024లో కెకెఆర్‌కు ముచ్చటగా మూడోసారి ట్రోఫీని అందించిన శ్రేయస్‌ అయ్యర్‌కే సాధ్యమైంది. ఆ తర్వాత శ్రేయస్‌ను వదులుకోవడం ఆ ఫ్రాంఛైజీ చేసిన ఘోర తప్పిదం. దీంతో 2025లో ఆ జట్టు ఆటపై పెను ప్రభావం చూపింది. దీంతో ఆ జట్టు గత సీజన్‌లో 8వ స్థానానికే పరిమితమై పలు విమర్శలను ఎదుర్కొంది.

మళ్లీ రహానేకే ఎందుకు..?
ఐపిఎల్‌ 2026 సీజన్‌ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ కెప్టెన్‌గా అజింక్యా రహానేను అధికారికంగా ప్రకటించింది. రింకూ సింగ్‌ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, మేనేజ్‌మెంట్‌ రహానే వైపే మొగ్గు చూపింది. దీంతో జట్టు కెప్టెన్సీపై ఉన్న ఉత్కంఠను కెకెఆర్‌ తెర దించింది. యూపి టి20 లీగ్‌లో మీరట్‌ మావెరిక్స్‌ను, రంజీ ట్రోఫీ 2024-25లో ఉత్తరప్రదేశ్‌ జట్టును విజయపథాన నడిపిన అనుభవం రింకూకు ఉంది. అలాగే కెకెఆర్‌తో సుదీర్ఘ అనుబంధం కూడా రింకూ సింగ్‌కు ఉంది. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ మాత్రం అనుభవజ్ఞుడైన రహానే వైపే మొగ్గు చూపింది. వేలానికి ముందే కెప్టెన్‌ ఎవరనేది తేల్చకుండా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంపైనా పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2025 సీజన్‌లో రహానే నాయకత్వంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుని ప్లేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. అయినప్పటికీ, బ్యాటర్‌గా రహానే జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అనుభవజ్ఞుడైన రహానే సారథ్యంలోనే జట్టు విజయపథాన నడుస్తుందని జట్టు మేనేజ్‌మెంట్‌ భావించింది.

బలమైన కోచింగ్‌, దుర్భేధ్య బ్యాటింగ్‌ లైనప్‌..
సీజన్‌-19 ఐపిఎల్‌ కోసం కెకెఆర్‌ తన కోచింగ్‌ స్టాఫ్‌లో భారీ మార్పులు చేసింది. అభిషేక్‌ నాయర్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించగా, సహాయక కోచ్‌గా షేన్‌ వాట్సన్‌ బాధ్యతలు చేపట్టాడు. పవర్‌ కోచ్‌గా ఆండ్రీ రస్సెల్‌, బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌథీ వ్యవహరించనున్నారు. గత వేలంలో కేకేఆర్‌ రూ.63 కోట్ల భారీ పర్సుతో బరిలోకి దిగి, కామెరూన్‌ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు, మతీషా పథీరణాను రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకుని వెంకటేష్‌ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు దక్కించుకున్నా, అతను విఫలం కావడంతో ఈసారి కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. మిస్టరీ స్పిన్నర్‌ వరున్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ ఏ సమయంలోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సమర్థులు.

గట్టి ఎదురు దెబ్బలు..
సీజన్‌ ప్రారంభానికి ముందే కెకెఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా మోకాలి గాయం కారణంగా 2026 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. 2026 టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అతని స్థానంలో రీప్లేస్‌మెంట్‌ను తీసుకోవడానికి కెకెఆర్‌ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, బిసిసిఐ ఆదేశాల మేరకు అతడిని విడుదల చేయాల్సి వచ్చింది. అతని స్థానంలో జింబాబ్వే పేసర్‌ బ్లెస్సింగ్‌ ముజారబానీని జట్టులోకి తీసుకున్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్‌), రింకూ సింగ్‌, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, రఘువంశీ, మనీష్‌ పాండే, గ్రీన్‌, అలెన్‌, తేజస్వి సింగ్‌, రాహుల్‌ త్రిపాఠి, సీఫెర్ట్‌, రోవన్‌ పావెల్‌, అనుకుల్‌ రారు, సార్థక్‌ రంజన్‌, దక్ష్‌ కమ్రా, రచిన్‌ రవీంద్ర, రమణ్‌దీప్‌ సింగ్‌, వైభవ్‌ అరోరా, మతీషా పథీరణ, కార్తీక్‌ త్యాగి, ప్రశాంత్‌ సోలంకి, ఆకాష్‌ దీప్‌, హర్షిత్‌ రాణా, ఉమ్రాన్‌ మాలిక్‌, ముజరబ్బానీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -