– 1 పరుగు తేడాతో రాయల్స్‌పై గెలుపు
– ఛేదనలో రియాన్ పరాగ్ పోరాటం వృథా
– కోల్‌కత 206/4, రాజస్థాన్ 205/8
రాజస్థాన్ రాయల్స్ రనౌట్!. ఆఖరు 6 బంతుల్లో 22 పరుగులు అవసరం కాగా 20 పరుగులే చేసిన రాయల్స్ మరోసారి ఛేదనలో చేజేతులా పరాజయం పాలైంది. రియాన్ పరాగ్ (95) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగినా రాజస్థాన్‌కు భంగపాటు తప్పలేదు. ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన కోల్‌కత నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అండ్రీ రసెల్ (57 నాటౌట్) ధనాధన్ ఫిఫ్టీతో కోల్‌కత తొలుత భారీ స్కోరు చేసింది.
నవతెలంగాణ-కోల్‌కత
ఆఖరు ఓవర్ థ్రిల్లర్‌లో మరోసారి రాజస్థాన్ రాయల్స్ బోల్తా పడింది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం కోల్‌కత నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో చివరి బంతికి రనౌట్‌తో 1 పరుగు తేడాతో రాయల్స్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులే చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (95, 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగినా..కోల్‌కత బౌలర్లు వరుణ్ చక్రవర్తి (2/32), మోయిన్ అలీ (2/43), హర్షిత్ రానా (2/41) కీలక వికెట్లతో కోల్‌కతను ముందంజలో నిలిపారు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ అండ్రీ రసెల్ (57 నాటౌట్, 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపులతో 206 పరుగుల భారీ స్కోరు చేసింది. రఘువంశీ (44), రహానె (30), గుర్బాజ్ (35) రాణించారు. అండీ రసెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 12 మ్యాచుల్లో రాజస్థాన్‌కు ఇది తొమ్మిదో పరాజయం కాగా.. కోల్‌కత 11 మ్యాచుల్లో ఐదో విజయం నమోదు చేసింది.
పరాగ్ మెరిసినా
రాజస్థాన్ రాయల్స్‌కు ఛేదన కలిసి రావటం లేదు. అలవోకగా గెలిచే మ్యాచుల్లో సైతం చేజేతులా ఓటమిపాలైన రాయల్స్ ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో అదే తడబాటు పునరావృతం చేసింది. కెప్టెన్ రియాన్ పరాగ్ (95) ఛేదనలో చెలరేగినా.. రాయల్స్ ఉత్కంఠ మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాప్ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్ (34, 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా.. వైభవ్ సూర్యవంశీ (4), కునాల్ సింగ్ రాథోర్ (0) విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ (0), వానిందు హసరంగ (0)లను వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో డగౌట్‌కు చేర్చాడు. అయినా, షిమ్రోన్ హెట్‌మయర్ (29, 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి రియాన్ పరాగ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. మోయిన్ అలీ ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు సహా తర్వాతి ఓవర్లో వరుణ్ చక్రవర్తిపై సిక్సర్‌తో.. వరుసగా ఆరు సిక్సర్లు బాది రాయల్స్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. 45 బంతుల్లోనే 95 పరుగులు పిండుకున్న పరాగ్ నిష్క్రమణతో రాయల్స్ కథ మొదటికొచ్చింది. ఆఖరు ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా.. జోఫ్రా ఆర్చర్ (12), శుభమ్ దూబె (25 నాటౌట్, 14 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) 20 పరుగులు చేశారు. ఆఖరు బంతికి రెండు పరుగులు చేసినా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లేది. కానీ ఆర్చర్ రనౌట్‌తో ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది.
రసెల్ ధనాధన్
సొంత గడ్డపై తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ ఓ దశలో 180 పరుగులు చేసేలా కనిపించింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (35, 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సహా అజింక్య రహానె (30, 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరిసినా.. ఇన్నింగ్స్‌లో వేగం కనిపించలేదు. సునీల్ నరైన్ (11) నిరాశపరిచాడు. యువ బ్యాటర్ రఘువంశీ (44, 31 బంతుల్లో 5 ఫోర్లు) సైతం ఎదురుదాడి చేయటంలో ఆశించిన ఫలితం సాధించలేదు. రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి నైట్‌రైడర్స్ తక్కువ స్కోరుకే పరిమితం చేసేలా కనిపించారు. కానీ విధ్వంసకారుడు అండ్రీ రసెల్ (57 నాటౌట్) ఊచకోత కోశాడు. ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో 22 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రింకు సింగ్ (19 నాటౌట్) సైతం రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో దండయాత్ర చేశాడు. ఆఖరు మూడు ఓవర్లలో 57 పరుగులు పిండుకున్న రసెల్, రింకు సింగ్ కోల్‌కతకు భారీ స్కోరు అందించారు. రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (1/30), యుధ్‌వీర్ సింగ్ (1/26), రియాన్ పరాగ్ (1/21) రాణించారు. మహీశ్ తీక్షణ (1/41) రసెల్ ఊచకోతకు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.
సంక్షిప్త స్కోరు వివరాలు :
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 206/4 (అండ్రీ రసెల్ 57 నాటౌట్, రఘువంశీ 44, గుర్బాజ్ 35, పరాగ్ 1/21)
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 205/8 (రియాన్ పరాగ్ 95, యశస్వి జైస్వాల్ 34, వరుణ్ చక్రవర్తి 2/32)