నివాళులర్పించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్
ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్‌లో కొమురం భీం 85వ వర్ధంతి
నవతెలంగాణ-కెరమెరి
జల్.. జంగిల్.. జమీన్ కోసం పోరాడిన కొమురం భీం పోరాట స్ఫూర్తి తెలంగాణకే కాదు..ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కుమురం భీం – ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసుల ఆరాధ్య దైవం కుమురం భీం 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ భీం విగ్రహానికి నివాళులర్పించారు. సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఆదివాసుల ఆశాజ్యోతి కొమురం భీం పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు. ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, బానిసత్వపు సంకెళ్లు తెంచడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. స్వయంపాలన ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన కొమురం భీం చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని తెలిపారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కుల సాధన కోసం గోండు వీరుడు కుమురం భీం తన జీవితాంతం పోరాడారని అన్నారు. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆడబిడ్డలు, గిరిజనుల హక్కుల కోసం పోరాడి దేశానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవ ఉద్యమాలకు మార్గదర్శకుడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కోవలక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఎమ్మెల్సీ దండే విఠల్, కొమురం భీం మనువడు సోనేరావు, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ క్రాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.