నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ పాఠశాల స్వచ్ఛ హరిత విద్యాలయ 5 స్టార్ రేటింగ్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ బుధవారం తెలిపారు. సురక్షితమైన తాగునీరు, వాన నీటి సంరక్షణ పథకం, మరుగుదొడ్లు, పరిశుభ్రత వినియోగం, భోజన పథకం నిర్వహణలో పరిశుభ్రత పాటించడం, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, పాఠశాలలో ఎకో క్లబ్ ఏర్పాటు, కంపోస్ట్ ఎరువు తయారీ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆన్ లైన్ ప్రశ్నావళి ద్వారా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 125 మార్కులకు గాను కోనాపూర్ పాఠశాలకు 115 మార్కులు రావడంతో 5స్టార్ రేటింగ్ కు ఎంపికైనట్లు తెలిపారు. ఉపాధ్యాయులందరి సమిష్టి కృషి వల్ల 5 స్టార్ రావడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా పాఠశాలకు స్వచ్ఛ హరిత విద్యాలయ 5 స్టార్ రేటింగ్ రావడం పట్ల పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
