ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితమే ఒక ప్రేరణ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమం, రైతు హక్కుల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఈ తరానికి బాపూజీ ఒక ఆదర్శమని, తన రాజకీయ జీవితమంతా సాధారణ ప్రజల కోసం అర్పించిన మహానుభావుడు బాపూజీ అని ఆయన అన్నారు.
ముఖ్యంగా రైతాంగం కోసం నిస్వార్థంగా కృషి చేశారనీ, ఆయన చూపిన మార్గం పల్లెబాటలో నడిపే వెలుగుదీపం లాంటిది అన్నారు. వారి ఆలోచనలు నేటి తరం స్పూర్తిగా తీసుకోవాలనీ, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన ఆశయాల సాధనకోసం కృషి చేయాలన్నారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలకోసం నిజాం ను ఎదిరించిన యోధుడు,తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాలను ప్రతిభావంతులైన చేనేత కళాకారులను ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.