Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'కొండపోచమ్మ' నీటిని విడుదల చేయాలి

‘కొండపోచమ్మ’ నీటిని విడుదల చేయాలి

- Advertisement -

– పురుగుల మందుతో రైతుల ధర్నా
– 300 ఎకరాల వరిపంటను కాపాడాలని డిమాండ్‌
నవతెలంగాణ-చేగుంట

కొండపోచమ్మ కాల్వల ద్వారా వస్తున్న నీళ్లను గొలుసుకట్టు చెరువుకు వదలాలని వెంకటాపూర్‌ రైతులు పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి చౌరస్తా గజ్వేల్‌, రామయంపేట్‌ వెళ్లే మార్గం రోడ్డుపై రైతులు కూర్చొని నీళ్లు చెరువుకు రాకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూడేండ్లుగా పంటకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ గొలుసుకట్టు చెరువుకు నీళ్లు వదలాలని, ఆయకట్టు కింద 300 ఎకరాల భూమిలో వరి సాగు పంట సాగవుతుందని తెలిపారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న పంటకు సరైన నీరు అందకుంటే గింజలు దెబ్బతినే అవకాశం ఉందని, తద్వారా దిగుబడి తగ్గుతుందని వెల్లడించారు. అదే జరిగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు వదిలేవరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ధర్నా స్థలానికి చేగుంట తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఇరిగేషన్‌ ఏఈ మమత, కెనాల్‌ కాల్వ డీఈ నరేశ్‌, ఆర్‌ఐ జయభారత్‌ రెడ్డి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చజెప్పినా రైతులు వినలేదు. సుమారు 3 గంటల పాటు ధర్నా కొనసాగింది.

ట్రాఫిక్‌ జాం .. పోలీసుల జోక్యం
రహదారి పూర్తిగా వాహనాలతో, బస్సులతో నిండి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులు, అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పులిమామిడి నుంచి వెంకటాపూర్‌కు వెళ్లే కాల్వను పోలీసులు, అధికారులు, రైతులు సందర్శించారు. అనంతరం వెంకటాపూర్‌ రైతులతో మాట్లాడి రెండు రోజుల్లో గ్రామానికి నీళ్లు వదులుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఎక్కడైనా ఇబ్బంది జరిగితే స్థానిక పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. దీంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్‌ సర్పంచ్‌ భర్త ప్రవీణ్‌ రెడ్డి, రైతులు భాస్కర్‌ గౌడ్‌, మహేశ్‌, నవీన్‌, నరసింహులు, అశోక్‌, నరేశ్‌, లింగయ్య, నారాయణ, దేవజ తదితరులు పాల్గొన్నారు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -