Monday, September 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశానికే ఆదర్శంగా 'కొండారెడ్డిపల్లి'

దేశానికే ఆదర్శంగా ‘కొండారెడ్డిపల్లి’

- Advertisement -

– ప్రతి ఇంటికీ ఉచిత సోలార్‌ ప్లాంట్‌
– రూ.134 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు : పాల్గొన్న మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డి పల్లిలో ప్రతి ఇంటికీ, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకూ అన్నింటికీ ఉచితంగా సోలార్‌ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామం విద్యుత్‌ స్వావలంభన సాధించి దేశంలోనే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి తెలిపారు. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో ఈ గ్రామం అభివృద్ధి దిశగా మరింత ముందడుగు వేస్తుందన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, డా. కూచుకుళ్ళ రాజేష్‌ రెడ్డి, డైరీ చైర్మెన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి, కొండారెడ్డిపల్లి అభివృద్ధి కమిటీ చైర్మెన్‌ కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌తో కలిసి మంత్రులు పాల్గొని రూ.134 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య సేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. కొండారెడ్డిపల్లిలో 516 గృహాలు, ప్రభుత్వ కార్యా లయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ రూ.10.53 కోట్ల వ్యయంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గ్రామస్తులకు విద్యుత్‌ వినియోగంలో స్వాతంత్య్రం కల్పించడమే కాకుండా ఆర్థిక ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. సోలార్‌ విద్యుత్‌ వల్ల పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ఆదాయంతో పాటు పునరుత్పత్తి శక్తికి కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి నెలకు 360 యూనిట్లు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, దీంట్లో ఇంటి వినియోగానికి సుమారు 120 యూనిట్లు ఉపయోగిస్తే.. మిగిలినదాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఇందులో ప్రతి యూనిట్‌కు రూ.5.25 చెల్లించేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ లబ్దిదారులతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. సెప్టెంబర్‌ నెలలో మొత్తం గ్రామం నుంచి సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపారని, తద్వారా గ్రామస్తులకు సుమారు రూ.5 లక్షల ఆదాయం సమకూరిందని తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.10.31 కోట్లతో వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్‌ కోసం శంకుస్థాపన చేశామని, అలాగే గ్రామంలో సోలార్‌ విద్యుత్‌ దీపాలు అమర్చేందుకు నిధులు కేటాయించినట్టు చెప్పారు.

రాష్ట్రంలో ప్రణాళికబద్ధంగా పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు మంత్రులు తెలిపారు. ప్రతి జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాలల ఏర్పాట్లతో పాటు డయాబెటిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్‌ అవర్‌)లోపు వైద్యం అందించే విధంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్యాన్సర్‌ నివారణకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందుకు ప్రత్యేక సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, పాడి పరిశ్రమ అభివృద్ధిపైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి జిల్లాలో పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతం లోని రైతులు పాడి పశువులను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. అలాగే రూ.55 కోట్లతో కొండారెడ్డిపల్లి గేట్‌ నుంచి పోల్కంపల్లి వరకు రహదారి మెరుగుదల పనులు (భూసేకరణ తో సహా), కొండారెడ్డిపల్లి ఓవర్‌ హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి పోల్కంపల్లి వరకు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ పైప్‌లైన్‌ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, గ్రామస్థాయి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -