ఆకారం- బీబీపేట రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు
నవతెలంగాణ- దుబ్బాక
మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. జీవనది అయిన కూడవెల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం దుబ్బాక మండలం ఆకారం శివారులోని దుబ్బాక – కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ బ్రిడ్జిపై నుంచి వరద వెళుతుంది.
సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షించి ఆ దారిని మూసి వేయించారు. వరదలు తగ్గుముఖం పట్టేదాకా ప్రజలు రాకపోకలని వాయిదా వేసుకోవాలని తప్పనిసరి అయితే ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ఏసీపీ సూచించారు.ఆయన వెంట దుబ్బాక సీఐ పీ.శ్రీనివాస్, ఎస్ఐ కే. కీర్తిరాజు, పలువురు గ్రామస్తులున్నారు.