శ్రీశైలం డ్యాం నాలుగు గేట్లు ఎత్తిన ఏపీ సీఎం నాగార్జునసాగర్‌కు లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నవతెలంగాణ -నాగార్జునసాగర్
శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగర్ చెంతకు చేరుకుంటోంది. మంగళవారం మధ్యాహ్నం ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుమారు లక్షా50వేల క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి 110 కిలోమీటర్లు సుమారు 8 గంటలపాటు కృష్ణమ్మ ప్రయాణం చేసి మంగళవారం రాత్రి 10గంటలకు సాగర్ జలాశయానికి చేరుకుంది. దాంతో సాగర్ జలాశయ నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. శ్రీశైలం డ్యాం నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా 1,06,976 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కులు మొత్తంగా 1,42,291 క్యూసెక్కులు సాగర్ జలాశయానికి చేరుతోంది.
882 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం
ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు ద్వారా 94710 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2914 క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 62,064 క్యూసెక్కులు, వాగులు, వంకల ద్వారా 8,318 క్యూసెక్కులు మొత్తంగా 1,94,2006 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను 882 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 533 అడుగులకు పెరిగింది. సాగర్ ఎడమ కాలువ ద్వారా 3090 క్యూసెక్కులు, ఎస్‌ఎల్బీసీ ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్నందున నాగార్జునసాగర్ డ్యాం అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జునరావు తెలిపారు.