Wednesday, July 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకృష్ణమ్మ పరవళ్లు

కృష్ణమ్మ పరవళ్లు

- Advertisement -

సాగర్‌ గేట్లను ఎత్తిన మంత్రులు
సాయంత్రానికి పూర్తి గేట్లు ఓపెన్‌
18 ఏండ్ల తర్వాత జులైలోనే నిండిన ప్రాజెక్టు
ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించడమే కాంగ్రెస్‌ లక్ష్యం : మంత్రులు ఉత్తమ్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
అలిగిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఉత్తమ్‌ ఆలస్యంగా వచ్చారని ఆగ్రహంతో గైర్హాజరు
నవతెలంగాణ- నాగార్జునసాగర్‌

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల సమీపానికి చేరుకోవడంతో మంగళవారం ఉదయం మంత్రులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పై నుంచి వరద ప్రవాహం పెరగడంతో సాయంత్రానికి అధికారులు పూర్తి గేట్లను ఎత్తారు. మొత్తం 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది. 18 ఏండ్ల తరువాత.. నెల ముందుగానే నాగార్జునసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మంత్రులు మాట్లాడుతూ.. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మేజర్‌ ప్రాజెక్టులను ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక గత వానాకాలం, యాసంగి, ప్రస్తుత వానాకాలం పంటకు సాగునీరు విడుదల చేయడం.. దానికి తగినట్టుగా సాగర్‌ జలాశయం పూర్తి స్థాయికి చేరుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. నిర్దిష్ట షెడ్యూల్‌కి ముందే సాగర్‌ ఎడమ కాలువకు సాగునీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటితోపాటు అదనంగా మరో మూడు వేల క్యూసెక్కుల నీటిని ఎడమ కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నామన్నారు. 18 ఏండ్ల తర్వాత తొలిసారి జులై నెలలోనే నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిగా నిండటం.. గేట్లను ఎత్తడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌, రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డీఎస్‌ చౌహన్‌, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ అమిత్‌, జిల్లా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్‌ అజరు కుమార్‌, సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జునరావు, ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

హాజరుకాని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాగర్‌ గేట్లు ఎత్తే కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మంత్రులు మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లో సాగర్‌కు చేరుకోవాల్సి ఉండగా 11.20 నిమిషాలకు వచ్చారు. అయితే, ఎయిర్‌పోర్టుకు ఉదయం 9 గంటలకే చేరుకోవాలని అనుకున్నా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆలస్యంగా వచ్చారు. అనుకున్న సమయానికే వచ్చిన మంత్రి కోమటిరెడ్డి ఉత్తమ్‌ కోసం ఎదురు చూసి.. ఆలస్యమైనందున హెలికాప్టర్‌ ఎక్కకుండా తిరిగి వెళ్లిపోయారు. దాంతో ఉత్తమ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సాగర్‌కు వచ్చారు. మంత్రులు పూజలు నిర్వహించిన అనంతరం 13వ గేటును ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, 14వ గేటును లక్ష్మణ్‌కుమార్‌ ఎత్తారు. అనంతరం మరో 6 గేట్ల ద్వారా మంత్రులు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత అధికారులు డ్యాం 26 గేట్లను ఎత్తేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరుపై విలేకరులు పలుమార్లు ప్రస్తావించగా మంత్రి ఉత్తమ్‌ దాటవేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -