Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకృష్ణమూర్తి@104..నేటికీ పెన్షన్‌

కృష్ణమూర్తి@104..నేటికీ పెన్షన్‌

- Advertisement -

రాయల్‌ నేవీ తిరుగుబాటు కేసులో 18 నెలలు జైలు శిక్ష
క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 8 నెలల జైలు జీవితం
1978లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ విరమణ
కృష్ణమూర్తికి అభినందనలు తెలిపిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 104 ఏండ్ల వయస్సుండి పెన్షన్‌ అందుకుంటున్న ఏకైక వ్యక్తిగా ప్రముఖ సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి నిలిచారు. ఆయన గుంటూరు జిల్లా ఏటుకూరులో 1923 సెప్టెంబర్‌ 29న జన్మించారు. 1948లో కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డలో 1948లో నెలకు రూ.37 జీతంతో రెవెన్యూ శాఖలో చేరారు. 1978లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్‌ అయ్యి 47 ఏండ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్‌ పాలనలో రాయల్‌ నావికాదళంలో పనిచేస్తూ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. నెవీ తిరుగుబాటులో పాల్గొన్నందుకుగానూ లక్నో, లాహోర్‌ జైళ్లల్లో 18 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని గుంటూరు సబ్‌ జైలులో ఎనిమిది నెలలు జైలు జీవితం గడిపారు. ఏపీ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఉద్యోగులకు కనీస వేతనాలు, హక్కుల కోసం సభలు, ఉద్యమాలు నిర్వహించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్న కాలంలో జరిగిన 106 రోజుల సమ్మెలో ఉద్యోగులను ముందుండి నడిపించారు. జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు నిత్యావసరాలు అందేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు అనేక పుస్తకాలు ఆయన స్వయంగా రచించారు. నేటికీ పలు పుస్తకాలను రాస్తూ సొంత ఖర్చులతో ముద్రిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేతగా ఏటుకూరి నేటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సీపీఐకి విరాళం అందిస్తూ సాయపడుతున్నారు. ఏటుకూరి కుటుంబ సభ్యులు సైతం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ‘104 ఏండ్లు దాటినా నేటికీ సమాజ మార్పు కోసం పరితపిస్తున్న ఏటుకూరి కృష్ణమూర్తికి అభినందనలు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆయన మరింత కాలం ఆరోగ్యంగా బతకాలని ఏపీ ఎన్‌జీఓ సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్‌ పాలంకి ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -