Saturday, January 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏడు గంటలు కేటీఆర్‌ విచారణ

ఏడు గంటలు కేటీఆర్‌ విచారణ

- Advertisement -

కోట్ల రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు, ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ ఆరా
కొన్నింటికి మాజీమంత్రి ఎదురు ప్రశ్నలు
జూబ్లీహిల్స్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏడు గంటలకు పైగా సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ప్రధానంగా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా కోట్లాది రూపాయలు సేకరించడం, ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై సిట్‌ కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్‌ ఇచ్చిన నోటీసు మేరకు శుక్రవారం ఉదయం 10:50 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్‌ భారీ ర్యాలీగా చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని బీఆర్‌ఎస్‌ కార్యాలయం నుంచి పలువురు నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో కేటీఆర్‌ ఊరేగింపుగా రావడంతో జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి 200 అడుగుల దూరంలోనే కార్యకర్తలు, ఇతర నాయకులను పోలీసులు ఆపేశారు.

కేవలం కేటీఆర్‌ కారును మాత్రమే ఏసీపీ కార్యాలయంలోకి అనుమతించారు. దాంతో పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డు మీదనే బైటాయించారు. ఏసీపీ కార్యాలయంలోకి ప్రవేశించిన కేటీఆర్‌ను అప్పటికే వేచి ఉన్న సిట్‌ అధికారులు ఆయనను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి కొద్ది సేపటి తర్వాత ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ విచారణలో డీసీపీలు రితురాజ్‌, నారాయణ్‌రావు, ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్‌ తదితరులు పాల్గొనగా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నగర స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్ కుమార్‌ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రూ.12 కోట్లు విలువ చేసే ఎలక్టోరల్‌ బాండ్స్‌ను సంధ్య శ్రీధర్‌ నుంచి అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మీరు వసూలు చేసింది నిజమేనా? అంటూ ప్రశ్నల వర్షాన్ని సిట్‌ అధికారులు ప్రారంభించినట్టు తెలిసింది. ఈ విధంగా ఎన్ని కోట్ల రూపాయలను ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరిట సేకరించారు, అందుకు మీరు ఎస్‌ఐబీకి చెందిన కొందరు అధికారుల సహకారాన్ని తీసుకున్న మాట నిజమేనా అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం.

అలాగే సిరిసిల్లలో ఫోన్‌ట్యాపింగ్‌ వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి కొన్ని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు, మరికొందరు వ్యాపారవేత్తలు, సినీ సెలెబ్రిటీల ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడింది నిజమేనా అని కూడా సిట్‌ ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఏయే సినీనటులు నేను బెదిరించినట్టు మీకు ఫిర్యాదు చేశారని కేటీఆర్‌ అధికారులను ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. అందుకు మా ప్రశ్నలు అవునా, కాదా అని సమాధానమివ్వండని సిట్‌ అధికారులు కేటీఆర్‌ను అడిగినట్టు తెలిసింది. అదే సమయంలో, రాధాకిషన్‌రావుకు మీరు కొన్ని ఫోన్‌ నెంబర్లను పంపించి ట్యాపింగ్‌ చేయాలని చెప్పారట కదా అనే ప్రశ్నకు.. అలా చెప్పినట్టు ఆయన చెప్పారా అంటూ కేటీఆర్‌ ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కాగా పోలీసు అధికారులతో నాకు సంబంధమేమిటని కేటీఆర్‌ ప్రశ్నించగా.. మరి రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావులకు పలుమార్లు మీరు ఫోన్‌ చేసినట్టుగా ఉంది కదా అని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అదే సమయంలో ఒక అధికారి కేటీఆర్‌ ముందు కొందరి పేర్ల జాబితాను ఉంచి వీరంతా మీకు తెలుసా అని ప్రశ్నించగా.. రాజకీయ నాయకుడిగా చాలా మంది కలుస్తారు, మాట్లాడుతారు అందరినీ గుర్తు పెట్టుకోలేం కదా అని ఆయన సమాధానమిచ్చినట్టు సమాచారం.

మధ్యాహ్నం 2-3 గంటల వరకు భోజన విరామం ఇచ్చాక.. సాయంత్రం 6.15 గంటల వరకు కేటీఆర్‌కు పలు ప్రశ్నలను సిట్‌ అధికారులు సంధించినట్టు తెలిసింది. కొన్నింటికి సమాధానమిచ్చిన కేటీఆర్‌ మరికొన్ని ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు వేస్తూ పోయారని సమాచారం. మొత్తమ్మీద ఏడు గంటలకు పైగా కేటీఆర్‌ను విచారించిన సిట్‌ అధికారులు.. ఆ సమాచారాన్ని పూర్తిగా రికార్డు చేసినట్టు తెలిసింది. చివరగా విచారణ కొనసాగుతున్నదనీ, అవసరమైతే మరోసారి పిలుస్తామని సిట్‌ అధికారులు కేటీఆర్‌కు తెలిపి పంపించివేశారని సమాచారం. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చిన కేటీఆర్‌ను చూసి, బయట వేచి ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున ‘కేటీఆర్‌ జిందాబాద్‌’, ‘పోలీస్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య కారెక్కిన కేటీఆర్‌.. తన కాన్వాయ్ తో వెళ్లారు. కేటీఆర్‌ విచారణ సాగుతున్నంత సేపు పలు మార్లు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తోసుకొని ముందుకు రావడం, వారిని పోలీసులు వెనక్కి నెట్టేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -